“హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకెళ్లింది. తన స్వరాలతో వీరమల్లుకి ప్రాణం పోశారనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు’ అన్నారు అగ్ర హీరో పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహరవీరమల్లు’ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. జ్యోతికృష్ణ దర్శకుడు. ఈ సినిమాలోని ‘సలసల మరిగే నీలోని రక్తమే..’అనే పాటను కీరవాణి స్వరపరచడంతో పాటు సాహిత్యాన్ని కూడా అందించారు. ఈ గీతం నేడు విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం పవన్‌కల్యాణ్, కీరవాణి కలుసుకొని సంగీతం, సాహిత్యాలకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు.
మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదని ప్రతి ఒక్కరినీ కార్యోన్ముఖుల్ని చేస్తూ కీరవాణి అద్భుతంగా గీతరచన చేశారని పవన్‌కల్యాణ్ కొనియాడారు. కీరవాణి తన సంగీతప్రస్థానం గురించి చెబుతుంటే సమయం తెలియలేదని, కీరవాణి సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు, చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా అని పవన్‌కల్యాణ్ ప్రశంసించారు. తెలుగు కథల్ని ప్రేమించే కీరవాణి తాను మెచ్చిన 32 కథలను ఓ సంకలనంగా తీసుకొచ్చి తనకు బహూకరించడం ఆనందంగా ఉందని, ఇందులో ఆయన రాసిన రెండు కథలున్నాయని చెప్పారు. సినిమా కోసం కీరవాణి ఎంతగానో తపిస్తారని, సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లారని పవన్ కల్యాణ్ అన్నారు.