కంటెంట్‌ని నమ్మి సినిమా తీయడం.. క్వాలిటీ విషయంలో వెనుకడుగు వేయకపోవడం గీతాఆర్ట్స్ స్పెషాలిటీ. అందుకే.. గీతాఆర్ట్స్ అంటే భారీ తనానికి కేరాఫ్ అడ్రస్ అంటారు. ప్రస్తుతం ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘తండేల్’. నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రధారులుగా చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
కథ రిత్యా ఈ సినిమాలోని ఓ కీలకమైన గీతాన్ని మేకర్స్ సిటీకి దూరంగా నిర్మించిన ఓ భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. కేవలం ఈ ఒక్క పాటకోసం మూడు కోట్లు ఖర్చు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే కథ కావడంతో అక్కడి జాతర్లలో రకరకాల వేషాలు వేసే పేరుమోసిన శ్రీకాకుళం కళాకారులు 65మందిని ఈ పాటకోసం మేకర్స్ రప్పించారు.
తొమ్మిదివందల మంది డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ పాటలో పాల్గొంటున్నారు. ఈ పాట కోసం వేసిన భారీ సెట్, ఈ పాటలో పాల్గొన్న కళాకారులు, కళారూపాలు, శ్రీకాకుళం వాతావరణాన్ని తలపించేందుకు చేసిన ప్రయత్నాలు.. వీటన్నింటికీ కలిపి రఫ్‌గా మూడుకోట్లు ఖర్చు తేలిందని యూనిట్ వర్గాల భోగట్టా. నాగచైతన్య కెరీర్లో ఒకపాటకు మూడు కోట్లు ఖర్చు చేయడం ఇదే ప్రథమం. శ్రీకాకుళంలో జరిగిన ఓ హృద్యమైన సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రేమకథపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.