ఈ సెప్టెంబర్ 5 నాటికి నాగచైతన్య తొలి సినిమా ‘జోష్’ విడుదలై పదిహేనేండ్లు. ఈ దశాబ్దంన్నర ప్రయాణంలో 28 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు నాగచైతన్య. ఆయన 29వ చిత్రం ‘తండేల్’. అక్కినేని లెగసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా నాగచైతన్య సత్తా చాటుతున్నారని, ‘తండేల్’లో చైతూ నట విశ్వరూపాన్ని చూస్తారని గురువారం మేకర్స్ తెలియజేస్తూ, నాగచైతన్యకు సంబంధించిన ఓ న్యూ పోస్టర్ని విడుదల చేశారు.
సముద్రపు అంచున ఫిషింగ్ బోట్‌పై నిలబడి రగ్గ్డ్ అవతార్‌లో చిరునవ్వులు చిందిస్తున్న చైతూ పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకునేలా వుంది. శ్రీకాకుళంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది.
సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాత: బన్నీ వాసు, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: గీతా ఆర్ట్స్