తెలుగు రాష్ర్టాల్లో వరద బాధితుల సహాయార్థం సినీ తారల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అగ్ర తారలు భారీ విరాళాలను ప్రకటిస్తూ తెర మీదే కాదు.. నిజ జీవితంలో కూడా తాము హీరోలమేనని నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్‌బాబు వంటి అగ్ర హీరోలు ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళాలతో తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఇప్పుడు వీరి వరుసలో పవన్‌కల్యాణ్, చిరంజీవి, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, అశ్వనీదత్, అలీ తదితర సినీ ప్రముఖులు భారీ విరాళాలతో తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెరో కోటి రూపాయల చొప్పున రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి యాభై లక్షల చొప్పున కోటి విరాళాన్ని అందజేయనున్నట్లు చిరంజీవి తెలిపారు. అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్, రామ్‌చరణ్ రెండు రాష్ర్టాలకు కలిపి తలో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అగ్ర హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రెండు రాష్ర్టాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల చొప్పున రెండు కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నందున అక్కడి వరద బాధిత 400 గ్రామపంచాయతీలకు 4కోట్ల్ల విరాళాన్ని అందిస్తున్నట్లు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. నిర్మాత ఆశ్వనీదత్ 20 లక్షలు, యువహీరో సాయిదుర్గతేజ్ 20లక్షలు. నటుడు అలీ 6 లక్షల విరాళాన్ని ప్రకటించారు.