‘పొలిమేర’ ‘ఇట్లు మారేడుమిల్లి’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల. ఆమె అల్లరి నరేష్ సరసన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం కామాక్షి భాస్కర్ల విలేకరులతో ముచ్చటించింది. ఈ సినిమాలో తన పాత్రపేరు ఆరాధన అని, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుందనే అంశాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయని చెప్పింది.
తన పాత్ర కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుందని, ఆరాధన లేకపోతే సినిమా కథే లేదని, అందరికి గుర్తుండిపోయే పాత్ర అవుతుందని తెలిపింది. ‘హీరోలు అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. కానీ నాయికల విషయంలో పరిమితులు కనిపిస్తాయి. అందుకే ప్రతి సినిమాలో ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటున్నా. నేను అపోలో హాస్పిటల్లో జనరల్ ఫిజీషియన్‌గా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు మాత్రం పూర్తిగా నటనకే సమయాన్ని కేటాయిస్తున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం తాను ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తున్నానని, మరో పెద్ద సినిమా ప్రకటన త్వరలో వస్తుందని, అలాగే ‘పొలిమేర-3’ కూడా ప్రారంభం అవుతుందని కామాక్షి భాస్కర్ల పేర్కొంది.