‘కెరీర్ తొలినాళ్లలో లవ్‌స్టోరీస్ చేయాలనుకున్నా. అయితే ‘మల్లేశం’ సినిమా తర్వాత అలాంటి మెచ్యూర్డ్ క్యారెక్టర్స్‌లో ప్రేక్షకులు నన్ను చూడాలనుకుంటున్నారు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పింది అనన్య నాగళ్ల. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్’ ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది.
ఈ సందర్భంగా సోమవారం అనన్య నాగళ్ల పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో బుజ్జమ్మ అనే మదర్ క్యారెక్టర్లో కనిపిస్తా. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా తర్వాత నన్ను బుజ్జమ్మ అని పిలుస్తారేమో (నవ్వుతూ). దర్శకుడు సాహిత్ నా పాత్రను చాలా గొప్పగా తీర్చిదిద్దాడు’ అని చెప్పింది. కథానుగుణంగానే ‘పొట్టేల్’ అనే టైటిల్ పెట్టారని, పొట్టేల్ తన దారిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఢీకొట్టి వెళ్తుందని, అదే స్వభావంతో సినిమాలో హీరో క్యారెక్టర్ కనిపిస్తుందని ఆమె తెలిపింది.
తెలంగాణ సంస్కృతి, సామాజిక సందేశం అద్భుతంగా కలబోసిన కథాంశమిదని, చాలా సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయని అనన్య పేర్కొంది. కెరీర్ గురించి మాట్లాడుతూ ‘మంచి అవకాశాలు వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కోసం ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరుముగ్గురు తెలుగమ్మాయిల్లో నా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది. అందుకే ‘పొట్టేల్’లాంటి ఎమోషనల్ సినిమాలో ఛాన్సొచ్చింది’ అని చెప్పింది.