అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా వార్ డ్రామా ‘ఫౌజీ’. స్వాతంత్రోద్యమ నాటి ఈ కథలో ఆయన సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నది. దీపావళి సందర్భంగా ఈ చిత్రం తాలూకు కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. రైఫిల్స్ క్లస్టర్ నడుమ ప్రభాస్ నిలబడి ఉన్నట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. యుద్ధరంగంలో ఒక్కడుగా నిలిచిన వీర సైనికుడిని స్ఫురింపజేసేలా ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు.
‘అతను పద్మవ్యూహాన్ని జయించిన పార్థుడు’ అనే క్యాప్షన్ ప్రభాస్ క్యారెక్టర్ తాలూకు పవర్‌ను సూచించేలా ఉంది. ఈ నెల 23న ప్రభాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ను వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. అనుపమ్‌ఖేర్, మిథున్చక్రవర్తి, జయప్రద, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుదీప్ ఛటర్జీ, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: హను రాఘవపూడి.