రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. సినిమాలోని ‘వామ్మో వాయ్యో’ అనే గీతాన్ని ఈ నెల 2న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో నాయకానాయికలు రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కలర్‌ఫుల్ అవుట్‌ఫిట్స్‌లో హుషారుగా స్టెప్పులేస్తూ కనిపిస్తున్నారు. పండుగ జోష్‌ను తెరపై ఆవిష్కరించే మాస్ సాంగ్ ఇదని, గ్రాండ్ విజువల్స్‌తో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, రవితేజ తనదైన శైలి కామెడీతో అలరిస్తారని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు.