దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం, స్టార్డమ్ ఉండగానే నాలుగు డబ్బులు వెనకేసుకొని సెటిల్ అయిపోవడం హీరోయిన్లకు పరిపాటే. కానీ మృణాళ్ఠాకూర్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నది. స్టార్ హీరో సినిమా అయినా సరే.. పారితోషికం భారీగా ముట్టజెబుతామన్నా సరే.. పాత్ర నచ్చకపోతే ‘నో’ చెప్పేస్తానని నిర్మొహమాటంగా చెప్పేసింది మృణాళ్ఠాకూర్. ‘నటికి సంతృప్తి అవసరం. ‘సీతారామం’లో సీతామహాలక్ష్మి పాత్ర, ‘హాయ్ నాన్న’లో యష్ణ పాత్ర నా కెరీర్‌కి ఓ గౌరవాన్ని కట్టబెట్టాయి.
ఏమాత్రం ప్రాధాన్యత లేని కమర్షియల్ రోల్స్ చేసి ఆ గౌరవాన్ని పోగొట్టుకోలేను. అందుకే కథలు వినే విషయంలో కాస్తంత కఠినంగానే ఉంటున్నా. డబ్బుకోసమో, లేక పెద్ద సంస్థ అనో కళ్లు మూసుకొని సంతకం చేయట్లేదు. కథలో లోతు, పాత్రలో బలం ఉందనిపిస్తేనే ‘ఓకే’ చెబుతున్నా. రీసెంట్గా వచ్చిన ‘డెకాయిట్’ సినిమాలోని పాత్రను కూడా ప్రాధాన్యతను బట్టే ‘ఎస్’ చెప్పాను. అనుకున్నట్టే ఆ పాత్రకు మంచి స్పందన వస్తున్నది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది మృణాళ్ఠాకూర్.