న్యూఢిల్లీ : నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31 రాత్రి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. ఆట పాటలతో హోరెత్తిస్తూ ఇష్టమైన ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ కొత్త ఏడాదిలో అడుగుపెట్టారు. డిసెంబర్ 31న జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల్లో ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇక జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ న్యూ ఇయర్‌ను స్వాగతించే వేళ డెలివరీ ఏజెంట్ అవతారమెత్తారు.
My first delivery brought me back to the zomato office. Lolwut! https://t.co/zdt32ozWqJ pic.twitter.com/g5Dr8SzVJP
— Deepinder Goyal (@deepigoyal) December 31, 2022
డిసెంబర్ 31న డెలివరీ ఏజెంట్‌గా వ్యవహరించిన ఫొటోలతో కూడిన పోస్ట్‌లను గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. జొమాటో ప్రధాన కార్యాలయంలో ఆర్డర్‌ను డెలివరీ చేస్తున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. తన తొలి డెలివరీ తనను తిరిగి జొమాటో ఆఫీస్‌కు రప్పించిందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఆయన తన బయోను డెలివరీ బై జొమాటో, లెట్స్బ్లింకిట్ అని మార్చారు.
ఈ ఫొటోల్లో గోయల్ బ్రాండ్ లోగోతో కూడిన రెడ్ హుడీని ధరించి చేతిలో కొన్ని ఫుడ్ ప్యాకెట్లతో కనిపించారు. ఈరోజు నాలుగు ఆర్డర్లు డెలివరీ చేసి ఆఫీస్‌కు తిరిగివచ్చాను. ఈ ఆర్డర్లలో మనవళ్లతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వృద్ధ దంపతులకూ డెలివరీ చేశానని గోయల్ రాసుకొచ్చారు. ఇక పోస్ట్ చివరిలో కస్టమర్లు, ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపిన గోయల్ ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.