Bank of Baroda | బ్యాంకింగ్ లావాదేవీల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు.. ఎప్పటికప్పుడు వివిధ బ్యాంకుల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ఆర్బీఐ పలు నిబంధనలు, మార్గదర్శకాలు తీసుకొస్తున్నది. ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఆ దిశలో ఓ అడుగు ముందుకేసింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పాజిటివ్ పే విధానం అమల్లోకి తెస్తున్నది.
కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు నూతన నిబంధనల అమలు తీరు గురించి తెలుసుకోవాలి. ప్రత్యేకించి చెక్‌బుక్ రూల్స్ మారుతున్నాయి. ఖాతాదారులు తాము జారీ చేసిన చెక్.. అందులో ఎంత మొత్తం నగదు రాశారు, ఎవరికి నగదు ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్న తదితర వివరాలన్నీ బ్యాంకు అధికారులతో ధృవీకరించుకుంటే లావాదేవీలు పూర్తవుతాయి. అయితే, రూ.5 లక్షల్లోపు లావాదేవీలకు బ్యాంక్ అధికారులతో ధృవీకరణలు అవసరం లేదు.
ఆగస్టు ఒకటో తేదీ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ గల చెక్ ఇతరులకు జారీ చేశారనుకోండి. దాని గురించి బ్యాంక్ అధికారులతో ధృవీకరించుకుంటే గానీ చెక్ పేమెంట్ క్లియర్ కాదు. కనుక చెక్ పేమెంట్ వివరాలను ముందే బ్యాంక్ అధికారులకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇచ్చిన వివరాలను బ్యాంక్ అధికారులు, సిబ్బంది, తమ వద్దకు వచ్చిన చెక్‌లోని వివరాలను చెక్ చేస్తారు. వివరాలు సరిపోలితే పేమెంట్ పూర్తవుతుంది. మీరు బ్యాంక్ అధికారులకు ఇచ్చిన సమాచారంలో గానీ, చెక్‌లో ఉన్న వివరాల్లో గానీ తేడా ఉంటే మాత్రం చెక్ క్లియరెన్స్ చేయకుండా పెండింగ్‌లో పెట్టేస్తారు.
గతంలోనే ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ పాలసీని పలు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ఆ జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వచ్చి చేరింది. కనుక ఆగస్టు ఒకటో తేదీ నుంచి చెక్ జారీ చేసేవారు తమ బ్యాంక్ శాఖ అధికారులకు ఎస్సెమ్మెస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఈ సమాచారం తెలుపాలి.
మీరు జారీ చేసిన చెక్ లబ్ధి దారుడి పేరు, ఖాతా నంబర్, నగదు మొత్తం, ట్రాన్సాక్షన్ కోడ్, చెక్ నంబర్ తదితర వివరాలు తెలియ చేయాలి. ఈ వివరాలను చెక్‌లోని వివరాలతో బ్యాంక్ అధికారులు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ పూర్తి చేస్తుంది.