Retirement Planning | రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారా? అయితే మొదట ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అవే.. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా వచ్చే ఆదాయం మీ జీవన శైలికి తప్పకుండా సరిపోవాలి. రిటైర్మెంట్ నిధి మీ జీవన కాలంలో మధ్యలోనే అయిపోకూడదు. ఇందుకోసం ఈ 5 సూత్రాలను తప్పక పరిశీలించాల్సిందే.
తగినంత నిధి: ప్రస్తుత జీవన శైలి ఆధారంగా కనీసం 20-25 ఏండ్లపాటు ఖర్చు ల్ని భరించేలా నిధిని ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం, పిల్లల పెండ్లిళ్లు వంటి బాధ్యతలున్నైట్టెతే దానికి తగిన విధంగా మరింత నిధిని సిద్ధం చేసుకోవాలి.
ద్రవ్యోల్బణం మరువద్దు: పెరిగే ధరలే ఆ సొమ్మును తినేస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు మీ వయసు 40 ఏండ్లు. నెలకు రూ.50 వేల ఖర్చులున్నాయి. 5 శాతం ద్రవ్యోల్బణం వద్ద 60 ఏండ్లకు నెలకు రూ.1.09 లక్షలు అవసరం. 80 ఏండ్లకు రూ.2.40 లక్షలు అవసరం. కాబట్టి పెరుగుతున్న ధరలనుబట్టి ఫండ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
వైద్య ఖర్చులు: వృద్ధాప్యంలో చాలామందికి వైద్య బీమా ఉండదు. మరికొంత మందికి మెడికల్ కవరేజీ పోతుంది. అందుకే అత్యవసర వైద్య నిధి కోసం కూడా కొంత నగదును ప్లాన్ చేసుకోవాల్సిందే.
సరైన చోట పెట్టుబడి: సంప్రదాయ, సురక్షిత సాధనాల్లోనే పెట్టుబడులను పెడుతూపోతే ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా రిటైర్మెంట్ నిధి ఏర్పర్చుకోలేం. అధిక రాబడుల కోసం కొద్ది మొత్తాలనైనా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలి. రిస్క్ ఉంటుంది కనుక మార్కెట్ నిపుణుల సలహాతో ఓ నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లతో ఆకర్షణీయ రాబడుల్ని అందుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఆర్బీఐ ఫ్లోటింగ్ బాండ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వంటి వాటిని పరిశీలించవచ్చు.
ఆస్తుల నగదీకరణ: రేపటి రోజు ఎలా ఉంటుందన్నది? ఎవరికీ తెలియదు. ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా.. కొన్నికొన్ని సందర్భాల్లో సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడే మనకు అండగా కొన్ని ఆస్తులనూ ఉంచుకోవాలి. వాటిని సులువుగా అమ్మి నగదు చేసుకొనే సౌలభ్యం కూడా ఉండాలి. స్థిరాస్తులు, బంగారం, వెండి వంటివి అనుకూలంగా ఉంటాయి.