Reward Points Scam | స్మార్ట్ ఫోన్లతోపాటు రోజురోజుకు అధునాతన టెక్నాలజీ వస్తున్నా కొద్దీ ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు. స్కామర్లు అమాయకులను బురిడీ కొట్టించి రూ.లక్షల్లో స్వాహా చేయడం నిత్య కృత్యంగా మారింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో దినకర్ శుక్లా అనే వ్యక్తికి సైబర్ మోసగాళ్లు ఓ లింక్ పంపారు. దాంతోపాటు మీ క్రెడిట్ కార్డుకు సంబంధించి రూ.9,240 విలువైన రివార్డు పాయింట్లు కోల్పోతున్నారని మెసేజ్ పెట్టారు. క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు పోగొట్టుకోవడం ఇష్టం లేని దినకర్ శుక్లా తన ఫోన్‌కు వచ్చిన లింక్ క్లిక్ చేశాడు.. క్రెడిట్ కార్డ్ నంబర్, వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) నమోదు చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన క్రెడిట్ కార్డ్ ఖాతా నుంచి రూ.3.38 లక్షలు, రూ.91,730 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.
అప్పుడు గానీ తాను మోసపోయానని దినకర్ శుక్లాకు అర్థమైంది. వెంటనే సంబంధిత క్రెడిట్ కార్డ్ హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్‌కి ఫోన్ చేశాడు. కానీ, తమ వద్ద ఆయన ఫోన్ లేదని, తామేం చేయలేమని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. సైబర్ మోసగాళ్లు ఫేక్ లింక్ ద్వారా ఆయన వ్యక్తిగత డిటెయిల్స్ మార్చేసే అవకాశం ఉందని తెలిపారు.
కనుక గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, లింక్‌లను క్లిక్ చేయొద్దని, ఆచితూచి స్పందించాలని పోలీసులు, సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా మెసేజ్‌పై సందేహం రాగానే నిర్ధారించుకోవడానికి సంబంధిత క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకు వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. వ్యక్తిగత సమాచారం ప్రొటెక్షన్ కోసం బ్యాంకు ఖాతాలకు టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ పెట్టుకోవాలని అంటున్నారు.