Fixed Diposits | ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో తమ పిల్లలు, కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. అత్యధికులు రిస్క్ లేని రిటర్న్స్ ఇచ్చే మదుపు మార్గాల వైపు మొగ్గు చూపుతుంటారు. అటువంటి పథకాల్లో ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్స్.. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి.
ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలంటే పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలే ఫేమస్.. కానీ వీటిల్లో మదుపు చేసిన మొత్తం.. మెచ్యూరిటీ తేదీ వచ్చే వరకూ విత్ డ్రాయల్ చేయడానికి వీల్లేదు.. కేంద్ర ఆర్థిక శాఖ కూడా తాజాగా పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల నుంచి మనీ విత్ డ్రాయల్ నిబంధనలను సడలించింది. ఈ మేరకు గత నెల ఏడో తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఐదేండ్ల గడువు గల పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో మదుపు చేసిన మొత్తం ముందస్తు విత్ డ్రాయల్ కోసం నాలుగేండ్లు ఆగాల్సిందే.
గత నెల తొమ్మిదో తేదీ వరకు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో మదుపు చేసిన మొత్తాల ముందస్తు విత్ డ్రాయల్స్ కోసం పాత నిబంధనలు వర్తిస్తాయి. కానీ, గత నెల 10 తర్వాత ఐదేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో మదుపు చేసిన మొత్తాల విత్ డ్రాయల్ నిబంధనలను సవరించారు. అవేమిటంటే..
డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఏ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం నుంచి విత్ డ్రాయల్ చేయడానికి అనుమతించరు. ఐదేండ్ల గడువు గల పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్ పథకం నుంచి నాలుగేండ్ల లోపు విత్ డ్రాయల్ చేయడానికి నిబంధన అనుమతించరు.
ఏడాది, రెండేండ్లు, మూడేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లను ఆరు నెలల తర్వాత విత్ డ్రా చేయొచ్చు. కానీ డిపాజిట్ తేదీ నుంచి ఏడాది లోపు విత్ డ్రా చేసుకుంటే పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ మాత్రమే వర్తిస్తుంది.
రెండేండ్లు, మూడేండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఏడాది లోపు విత్ డ్రా చేస్తే ఏడాది లేదా రెండేండ్ల వడ్డీపై రెండు శాతం పెనాల్టీ వసూలు చేస్తారు. ఉదాహరణకు మూడేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పథకం నుంచి ఏడాది తర్వాత విత్ డ్రా చేస్తే రెండేండ్లకు పెనాల్టీ వసూలు చేస్తారు. ఐదేండ్ల గడువు గల పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల నుంచి నాలుగేండ్లు పూర్తవగానే విత్ డ్రా చేస్తే సేవింగ్స్ ఖాతా వడ్డీ మాత్రమే చెల్లిస్తారు.