న్యూఢిల్లీ : రూ.2,000 పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.4% మర్చంట్ ఫీజు వసూలు చేయాలన్న మోదీ సర్కార్ ప్రణాళిక ఎక్కువగా అమెరికా కంపెనీలకే లబ్ధి చేకూర్చనున్నది. వాణిజ్య నిపుణుల ప్రకారం.. ఈ ఫీజు అమెరికా కంపెనీ వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్ పేకు కొత్త ఆదాయ వనరును సృష్టించడంతోపాటు త్వరలో చేపట్టనున్న ఐపీవోకు ముందు దాని విలువను పెంచే అవకాశం ఉన్నది. భారత్ ఉచిత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, రూపే నెట్వర్క్ తమకు ప్రతికూలంగా మారాయని అమెరికా కంపెనీలు చాలాకాలంగా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కూడా ఈ చర్య కొంతవరకు తగ్గించవచ్చు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) పేర్కొన్న అంచనాల ప్రకారం.. యూపీఐ లావాదేవీల్లో 80 శాతానికి పైగా ఫోన్ పే, గూగుల్ పే కలిపి నిర్వహిస్తున్నాయి.
అందువల్ల ఈ మార్పు ముఖ్యంగా ఈ రెండు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నది. అయితే దీని ప్రభావం యూపీఐ ఆపరేటర్లకే పరిమితం కాదు. అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌లైన వీసా, మాస్టర్‌కార్డ్ పోటీ స్థితిని కూడా ఈ మార్పు మెరుగుపరచవచ్చని జీటీఆర్ఐ వాదిస్తున్నది. యూపీఐతో పోలిస్తే కార్డ్ చెల్లింపులపై ఉండే వ్యయ వ్యత్యాసం తగ్గడమే దీనికి కారణమని చెప్తున్నది. క్రెడిట్ కార్డుకు ఎండీఆర్ 1.5% నుంచి 2.5% వరకు, డెబిట్‌కార్డుకు 0.9% వరకు ఉన్నది. కొత్త యూపీఐ రేటు 0.4% క్రెడిట్, డెబిట్ కార్డుల ఎండీఆర్ కంటే తక్కువగా ఉన్నది. భారత్‌లో సున్నా ఖర్చుతో కూడిన యూపీఐ వ్యవస్థ, చెల్లింపుల మార్కెట్లో రూపే స్థానం కలిసి వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అంతర్జాతీయ నెట్‌వర్క్‌లను ఇప్పటివరకు ప్రతికూల స్థితితో ఉంచాయని థింక్‌ట్యాంక్ చెప్తున్నది. అయితే యూపీఐపై చార్జీలు విధించడం కార్డ్ నెట్‌వర్క్‌ల పోటీ సమీకరణాన్ని మారుస్తుందని జీటీఆర్ఐ తెలిపింది.
ఈ నిర్ణయంపై అమెరికా ఒత్తిడి ప్రభావం చూపిందన్న వాదనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిరస్కరించారు. కొత్త విధానం స్థిరమైన చెల్లింపుల వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే భారతదేశపు పబ్లిక్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగిస్తున్న విదేశీ యాజమాన్యంలోని టెక్నాలజీ కంపెనీలకు అదనపు ఆదాయాన్ని సృష్టించడానికి భారతీయ వ్యాపారులు, వినియోగదారులు సహాయపడాలా అని జీటీఆర్ఐ ప్రశ్నించింది. యూపీఐని భారతీయ ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు అభివృద్ధి చేశాయని, అయితే జీటీఆర్ఐ పేర్కొన్న అంచనాల ప్రకారం ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయని థింక్ ట్యాంక్ పేర్కొన్నది. ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తున్న విదేశీ ప్లాట్‌ఫామ్‌లపై భాగస్వామ్య రుసుం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని జీటీఆర్ఐ వాదిస్తున్నది. భవిష్యత్తులో ఇతర యూపీఐ లేదా రూపే లావాదేవీలకు కూడా ఫీజులను విస్తరించే అవకాశం ఉన్నదని చెప్తున్నది.
జీటీఆర్ఐ, భారతీయ ఫిన్‌టెక్ ప్రచురణ సంస్థ పేర్కొన్న అంచనాల ప్రకారం ఫోన్ పే యూపీఐ లావాదేవీల్లో 45 శాతం నిర్వహిస్తుండగా, గూగుల్ పే సుమారు 35 నుంచి 40 శాతం వరకు వాటాను కలిగి ఉన్నది. ఈ అంచనాల ప్రకారం లావాదేవీల పరిమాణంలో ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు కలిపి 80 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. ఫోన్ పేలో సుమారు 70 శాతం వాటా వాల్మార్ట్ది కాగా, గూగుల్ పేకు అమెరికాకు చెందిన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ యజమాని. కొత్త ఎండీఆర్ వల్ల ఇంతకుముందు తక్కువ లేదా ఎలాంటి మర్చంట్ ఫీజు ఆదాయం రాని లావాదేవీల నుంచి చెల్లింపు యాప్‌లు ఆదాయం పొందే అవకాశం ఏర్పడుతున్నది. అయితే 0.4% మొత్తాన్ని చెల్లింపు యాప్‌లు పూర్తిగా తమ వద్ద ఉంచుకోవు. ఎండీఆర్‌ను బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థలోని ఇతర భాగస్వాముల మధ్య పంచుతారు. గతంలో పరిశ్రమ అంచనాల ప్రకారం, థర్డ్ పార్టీ పేమెంట్ ప్రొవైడర్లకు సుమారు 30 శాతం, మిగిలిన మొత్తాన్ని జారీ చేసే బ్యాంకులు, అక్వైరింగ్ బ్యాంకులు పొందవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ఫోన్ పేకు భారీ లావాదేవీల ఆధారంగా లభించే ఆదాయ పూల్‌లో కొంతభాగం కూడా ఆర్థికంగా గణనీయంగా మారవచ్చు.
2026 ఆగస్టులో యూపీఐ 2,451 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. వీటి విలువ రూ.29.9 లక్షల కోట్లు. ఈ లావాదేవీల్లో కొంత భాగంపై చిన్న మొత్తంలో ఫీజు విధించినా అది గణనీయమైన ఆదాయాన్ని సృష్టించే అవకాశం ఉన్నది. పరిశ్రమ, బ్రోకరేజ్ సంస్థల అంచనాల ప్రకారం.. వ్యవస్థ పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత వార్షిక ఎండీఆర్ ద్వారా సుమారు రూ. 16,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల వరకు ఆదాయ పూల్ ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ భారం ప్రజలపై పడదని సర్కార్ ఎంతగా చెప్తున్నప్పటికీ అందుకు అవకాశాలు చాలా తక్కువ. చాలా దుకాణాలు, హార్డ్‌వేర్ షాపుల్లో ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగిస్తే చార్జీలను వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నారు. లేదంటే యూపీఐ ద్వారా లేదా నగదు చెల్లించమని చెప్తున్నారు. ఇప్పుడు యూపీఐపై చార్జీలు వేయడంతో ఆ భారం కూడా వినియోగదారులపైనే మళ్లించే ప్రమాదమున్నది.
రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో రూ.2 వేలకు పైన యూపీఐ చెల్లింపులను అంగీకరించకూడదని మధ్యప్రదేశ్ పెట్రోల్ పంప్ డీలర్ల సంఘం నిర్ణయించింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జి విధించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సంఘం తెలిపింది.