Yes Bank Home loan offer | ప్రస్తుతం సొంతింటి కొనుగోళ్ల కోసం గిరాకీ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీరేట్లు తగ్గించడంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేశాయి. ఆ జాబితాలో మరో ప్రైవేట్ బ్యాంక్ చేరింది. పండుగల సీజన్లో యెస్ బ్యాంకు ఇంటి రుణాలపై వడ్డీరేట్లు 6.7 శాతానికి తగ్గించివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇది పరిమితమైన ఆఫర్ అని, 90 రోజుల పాటు అమలులో ఉంటుందని యెస్ బ్యాంకు తెలిపింది. ఉద్యోగులుగా ఉన్న మహిళా రుణ గ్రహీతలకుమరో 0.05 శాతం వడ్డీ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం యెస్ బ్యాంకు 8.95 నుంచి 11.80 శాతం వడ్డీపై ఇండ్ల రుణాలు అందిస్తున్నది.
35 ఏండ్ల టెన్యూర్‌తో తక్కువ ఈఎంఐ ఆల్టర్నేటివ్స్, మినిమం డాక్యుమెంటేషన్, నో ప్రీపేమెంట్ పెనాల్టీల వంటి వసతులు కల్పిస్తున్నట్లు యెస్ బ్యాంక్ తెలిపింది. వచ్చే మూడు నెలల్లో ఇండ్లు, రిటైల్ రుణాల బుక్ రెండు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు యెస్ బ్యాంక్ ఎండీ కం సీఈవో ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.