WPI | జులైలో టోకు ధరల సూచిత ఆధారిత ద్రవ్యోల్బణం రేటు (-)0.58 శాతానికి చేరుకుంది. గురువారం ప్రభుత్వం విడుదల గణాంకాలు పేర్కొన్నాయి. జులైలో టోకు ద్రవ్యోల్బణం రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి చేరుకున్నది. ఆహార వస్తువులు, ఖనిజ నూనెలు, ముడి పెట్రోలియం, సహజ వాయువు, లోహాల తయారీ మొదలైన వాటి ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం ప్రతికూల రేటుకు కారణమని పరిశ్రమల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. జూన్లో టోకు ద్రవ్యోల్బణం 20 నెలల కనిష్ట స్థాయి -0.13శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. మేలో టోకు ధరల సూచిక (WPI) 14 నెలల కనిష్ట స్థాయి 0.39శాతానికి తగ్గింది. టోకు ధరల సూచిక టోకు వ్యాపారులు కంపెనీలకు విక్రయించే వస్తువుల ధరల్లో మార్పులను కొలుస్తుంది. వినియోగదారుల ధరల సూచిక (CPI) వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు, సేవల ధరలను ట్రాక్ చేస్తుంది. జూలైలో వరుసగా రెండవ నెల కూడా టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) ప్రతికూలంగానే ఉన్నది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఆహార వస్తువులు, ఇంధన ధరలు తగ్గాయి. అయితే, తయారీ వస్తువుల ధరలు పెరిగాయి. జూన్లో టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం (-) 0.13 శాతంగా ఉండగా.. గత ఏడాది జూలైలో ఇది 2.10 శాతంగా నమోదైంది. జూలై 2025లో ద్రవ్యోల్బణం ప్రతికూల రేటుకు ప్రధానంగా ఆహార వస్తువులు, ఖనిజ నూనెలు, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ప్రాథమిక లోహాల ధరలు తగ్గడం కారణమని పరిశ్రమ మంత్రిత్వశాఖ పేర్కొంది. టోకు ధరల సూచిక డేటా ప్రకారం. జూలైలో ఆహార వస్తువులు 6.29 శాతం తగ్గాయి. జూన్లో ఇది 3.75 శాతం తగ్గింది. ఈ కాలంలో కూరగాయల ధరలలో భారీ తగ్గుదల కనిపించింది. కూరగాయలలో ప్రతి ద్రవ్యోల్బణం జూలైలో 28.96 శాతం ఉండగా, జూన్లో ఇది 22.65 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం జూలైలో 2.05 శాతంగా.. గత నెలలో ఇది 1.97 శాతంగా ఉన్నది. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం జూన్లో 2.65శాతం నుంచి జులైలో 2.43శాతం ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదవగా.. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ ఆగస్టు తొలి వారంలో వడ్డీ రేట్లను 5.5శాతంగానే కొనసాగించిన విషయం తెలిసిందే.