మాదాపూర్ (హైదరాబాద్), మార్చి 11: మహిళలు వ్యాపార రంగాల్లోనూ రాణించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. చాలామంది మహిళలు పెట్టుబడుల గురించి అవగాహన లేక సొంత డబ్బుతో వ్యాపారాలు మొదలు పెడుతున్నారని, వారంతా ప్రభుత్వ పథకాలను, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ లోని హైటెక్స్, కోవె (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్) ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించిన ‘ది బిజినెస్ ఉమెన్ ఎక్స్ పో 2022’కు కవిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైటెక్స్ తెలంగాణ బిజినెస్ హెడ్ శ్రీకాంత్, కోవె సభ్యులు వందన మహేశ్వరీ, మధు సత్యాగీలతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఎందరో మహిళలు ఉద్యోగాలను కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. 47 శాతం మహిళలు ఉద్యోగాలకు దూరమయ్యారని చెప్పారు. వీరందరికీ తిరిగి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేయాలంటూ ఆయా కంపెనీలను ఈ సందర్భంగా కవిత విజ్ఞప్తి చేశారు.
అంతా కలిసి రావాలి
మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ అభివృద్ధికి అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల కోసం సరైన పాలసీలు, పారిశ్రామిక కారిడార్లలో భూములను కేటాయించడమేగాక, ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్థలలో ప్రవేశం అవసరమని, ప్రతీ మహిళా పారిశ్రామికవేత్త తమ మూలధన అవసరాలను బ్యాంకుల ద్వారా తీర్చుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. 150 స్టాల్స్కుపైగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో పలు రకాల ఉత్పత్తులు, 250కిపైగా బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.