న్యూఢిల్లీ, జనవరి 16: దేశీయ ఐటీ దిగ్గజ లాభాలకు నూతన కార్మిక చట్టాల సెగ గట్టిగానే తగులుతున్నది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్లు నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలోకి విప్రో కూడా చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,119 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,353.8 కోట్ల లాభంతో పోలిస్తే 7 శాతం తగ్గిందని పేర్కొంది. నూతన కార్మిక చట్టాల కోసం ఒకేసారి రూ.302.8 కోట్ల నిధులు వెచ్చించడంతో సంస్థ లాభాల్లో గండిపడిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.5 శాతం ఎగబాకి రూ.22,318.8 కోట్ల నుంచి రూ.23,555.8 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో ఆశించిన స్థాయిలోనే నమోదయ్యాయయిన, ఏఐ కీలకంగా మారుతున్నదని కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పైల్లె తెలిపారు.