న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.3,208.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,646.3 కోట్ల కంటే 21.2 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.22,516 కోట్ల నుంచి రూ.22,301 కోట్లకు పడిపోయింది. మరోవైపు సంస్థ షేరుహోల్డర్లకు శుభవార్తను అందించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు మరో షేరును బోనస్‌గా అందిస్తున్నట్లు ప్రకటించింది. రికార్డు తేది నాటికి అర్హత కలిగిన ఈక్విటీ వాటాదారులుగా ఉండాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పైల్లె మాట్లాడుతూ..ఆదాయ, బుకింగ్, మార్జిన్లలో అంచనాలకుమించి రాణించినట్లు చెప్పారు. బిలియన్ డాలర్ల కంటే అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నటు చెప్పారు.