Wipro | న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రోలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కంపెనీ సీఈవో థియరీ డెలాపోర్టే తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశా రు. థెర్రీ రాజీనామాను ఆమోదించిన కంపెనీ బోర్డు..ఈ స్థానంలో శ్రీనివాస్ పల్లియ నియమిచింది. ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నట్లు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. థెర్రీ రాజీనామా చేసినప్పటికీ మే 31, 2024 వరకు కంపెనీలో విధులు నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 7 గంటలకు కంపెనీ బోర్డు సమావేశమై డెలాపోర్టే రాజీనామాపై చర్చించిన అనంతరం..ఈ స్థానంలో శ్రీనివాస్‌ను నియమకానికి పచ్చజెండా ఊపింది. ఆయన ఐదేండ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇందుకోసం వాటాదారులు, నియంత్రణ మండళ్లు అనుమతించాల్సి ఉంటుందని పేర్కొంది. గత మూడు దశాబ్దాలకు పైగా సంస్థలో పలు హోదాలో పనిచేసిన పలయకు పదోన్నతి లభించినట్లు అయింది. 1992లో విప్రోలో చేరిన ఆయన..విప్రో కన్జ్యూమర్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్‌గాను, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌గా విధులు నిర్వహించారు.
56 ఏండ్ల వయస్సు కలిగిన ఫ్రాన్స్‌కు చెందిన డెలాపోర్టే.. విప్రోలో చేరకముందు క్యాప్‌జెమినీ చీఫ్ ఆపరేటింగ్ అధికారికిగా విధులు నిర్వహించారు. జూలై 2020 నుంచి ఆయన విప్రో సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది చివరివరకు దేశీయ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న డెలాపోర్ట్..ఏడాదికి రూ.82 కోట్ల చొప్పున వేతనాన్ని అందుకుంటున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్ సీఈవోల కంటే అధికంగా పొందుతున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు, ఈ రాజీనామా ఈ నెల 6 నుంచి అమలులోకి రానున్నది..ఇది ఒక అపురూపమైన గౌరవం, సంస్థ వృద్ధి, విజయంలో పాత్ర పోషించినందుకు చాలా సంతోషిస్తున్నా. గత నాలుగేండ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను. ముఖ్యంగా క్లయింట్లకు, అసోసియేట్లకు, వాటాదారులకు ఎన్నో ప్రయోజనాలు లభించాయని డెలాపోర్టే రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజీనామా చేసినప్పటికీ మే 31 వరకు సంస్థలోనే కొనసాగనున్నట్లు ప్రకటించారు.