న్యూఢిల్లీ, జూన్ 10: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో సీఈవో థిర్రీ డెలాపోర్ట్స్ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 10.5 మిలియన్ డాలర్ల(రూ.79.66 కోట్ల) వార్షిక వేతనాన్ని అందుకున్నారు. ఇతర ఐటీ సంస్థల సీఈవోలు అందుకున్న దానికంటే అత్యధికంగా ఆయన అందుకోవడం విశేషం. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 10.2 మిలియన్ డాలర్లు, హెచ్‌సీఎల్ సీఈవో విజయకుమార్ 4.15 మిలియన్ డాలర్లు, టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ 3.32 మిలియన్ డాలర్లు, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ణానీ 2.83 మిలియన్ డాలర్లు అందుకున్నారు. అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు ఇచ్చిన సమాచారం మేరకు గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను థెర్రీ..వేతనం, అలవెన్స్‌ల కింద 1.7 మిలియన్ డాలర్లు, కమిషన్ కింద 2.5 మిలియన్ డాలర్లు, ప్రయోజనాల కింద మరో 2.5 మిలియన్ డాలర్లు, ఇతర రాయితీల కింద మరో 4 మిలియన్ డాలర్లు పొందారు.