I-Phone 14 | ఐఫోన్-14 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఆపిల్ ముహూర్తం ఖరారు చేసిందని తెలుస్తున్నది వచ్చేనెల ఏడో తేదీన జరిగే వేడుకలో ఐఫోన్-14ను ఆపిల్ విడుదల చేయనున్నదని సమాచారం. ఈ దఫా వచ్చే ఐఫోన్లో మొబైల్ ఫోన్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లోనూ శాటిలైట్ కనెక్టివిటీతో ఫోన్ కాల్స్ చేయొచ్చు.. ఎస్సెమ్మెస్‌లు పంపించొచ్చు. ఇందుకోసం ఆపిల్ సొంతంగా శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్.. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) ఆఫర్ చేస్తున్నది.
ఇలా శాటిలైట్ కనెక్టివిటీతో ఫోన్ కాల్స్ చేసుకోవడానికి వీలుగా గ్లోబల్ స్టార్ అనే సంస్థతో కలిసి ఆపిల్ సొంత శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తున్నది. వచ్చే నెల ఏడో తేదీన జరిగే వేడుకలో దీనిపై ఆపిల్ ఓ ప్రకటన చేస్తుందని అంతా భావిస్తున్నారు. టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ.. ఇప్పటికే శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నది. ఆపిల్ సొంతంగా శాటిలైట్ కమ్యూనికేషన్స్ వ్యవస్థను ప్రారంభిస్తే.. స్పేస్ ఎక్స్ మాదిరిగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థల జాబితాలో చేరనున్నది.
ఐఫోన్-14 సిరీస్ ఫోన్లు నాలుగు వేరియంట్లలో తీసుకొస్తున్నది ఆపిల్. ఐఫోన్14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే వేరియంట్లలో వస్తోంది. ఐఫోన్-14లో ఏ-15 బయోనిక్ చిప్ వాడారు. వీటితోపాటు మూడు కొత్త ఐప్యాడ్స్, మ్యాక్ కంప్యూటర్లు, ఆపిల్ వాచ్ ప్రో, ఆపిల్ వాచ్ సిరీస్-8 విడుదల అవుతాయి.