Sukanya Samruddi Yojana | చిన్నమొత్తాల పొదుపు పథకాల (Small Savings Schemes) వడ్డీరేట్లను కేంద్రం సవరించింది. సుకన్య సమృద్ధి యోజన (SSY)తోపాటు మూడేండ్ల గడువు గల పోస్టాపీసు టర్మ్ డిపాజిట్ (Term Diposit) పథకాలపై వడ్డీరేట్లు పెంచేసింది. మిగతా పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకంపై ఇప్పుడు ఎనిమిది శాతం వడ్డీరేటు అమల్లో ఉండగా తాజాగా 20 బేసిక్ పాయింట్లు పెంచింది. దీంతో సుకన్య సమృద్ధి యోజన పథకంపై 8.20 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. ఇక మూడేండ్ల గడువు గల టర్మ్ డిపాజిట్ పథకంపై 10 బేసిక్ పాయింట్లు వడ్డీరేటు పెరుగనున్నది. దీంతో మూడేండ్ల గడువుగల టర్మ్ డిపాజిట్ స్కీంపై ఏడు శాతం వడ్డీరేటును 7.1 శాతానికి పెరుగుతుంది.
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్రం ప్రతి మూడు నెలలకోసారి వడ్డీరేట్లు సవరిస్తుంది. సవరించిన వడ్డీరేట్లు జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 31 వరకు వర్తిస్తాయి. పీపీఎఫ్ పథకంలో మదుపు చేసే వారికి కేంద్రం మరోమారు నిరాశ మిగిల్చింది. ఇక రికరింగ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్ స్కీమ్, మంత్లీ ఇన్ కం స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీరేట్లు యధావిధిగా కొనసాగుతాయి.