రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు పెంపు నేపథ్యంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లూ పెరుగుతూపోతున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఏడాది-మూడేండ్ల కాలపరిమితి ఎఫ్డీలపై ఎస్బీఐ వడ్డీరేటు 5.1-5.2 శాతంగానే ఉండేది. ఇప్పుడది 6.75 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్లకైతే కొన్ని బ్యాంకులు గరిష్ఠంగా 7.25-9. 26 శాతం వడ్డీరేటును కూడా ఆఫర్ చేస్తున్నా యి.
ఈ క్రమంలోనే సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉన్న బ్యాంక్ ఎఫ్డీలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏడాది క్రితం ఎఫ్డీలు చేసినవారు దాన్ని ఉపసంహరించుకుని కొత్త ఎఫ్డీలు తీసుకోవడం లాభదాయకంగా తయారైంది.
ఇవి గుర్తుంచుకోండి
ప్రస్తుతం వడ్డీరేట్లు పెరిగాయి కదా అని పాత ఎఫ్డీలను వెంటనే రద్దు చేసుకోవడం పొరబాటే. ఓ నిర్ణయం తీసుకునేముందు పాత ఎఫ్డీల కాలపరిమితి ఇంకా ఎంత మిగిలి ఉన్నది?, అదనపు వడ్డీరేటుతో ఎఫ్డీలకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఆప్షన్లు ఏమిటి?, రద్దు చేసుకునేటప్పుడు పడే చార్జీల భారం ఎంత? అన్నది తప్పక తెలుసుకోవాలి. మీ పాత ఎఫ్డీ కాలపరిమితి మరో ఏడాదిలోపే ముగుస్తుందనుకుంటే రద్దు చేసుకోకపోవడమే ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మీరు ఆదాయ పన్ను శ్లాబులో ఉంటే.. ఎఫ్డీలపై పడుతున్న పన్ను లెక్కలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.