న్యూఢిల్లీ, జనవరి 15: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు విజృంభించాయి. గత నెల డిసెంబర్లో 2.37 శాతానికి ఎగబాకాయి. ఆహారేతర, ముఖ్యంగా తయారీ రంగ వస్తూత్పత్తుల రేట్లు పరుగులు పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంధనం, విద్యుత్తు ప్రియమైనట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల్లో తేలింది. నిజానికి 2023 డిసెంబర్లో ఇది 0.86 శాతంగానే ఉన్నది. ఇక గత ఏడాది నవంబర్లో 1.89 శాతంగా నమోదైంది. కాగా, ఆహార ద్రవ్యోల్బణం 8.47 శాతంగా ఉన్నది. నవంబర్లో ఇది 8.63 శాతంగా ఉన్నట్టు వెల్లడైంది. తృణధాన్యాలు, పప్పులు, గోధుమల ధరలు దిగిరావడం కలిసొచ్చింది.
కూరగాయల రేట్లు మాత్రం దిగిరావడం లేదు. హోల్సేల్ మార్కెట్లో ఆయా వెజిటెబుల్స్ ధరలు కిలో రూ.40-80 వరకు పలుకుతున్నాయి. ఇక రిటైల్ మార్కెట్లో కిలో రూ.60 నుంచి రూ.120పైనే ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధరల పెరుగుదల 28.65 శాతంగా ఉన్నది. గత నెల ఆలుగడ్డ రేటు 93.20 శాతం, ఉల్లిగడ్డ ధర 16.81 శాతం చొప్పున పెరిగాయి. నూనె గింజల రేటూ 2.46 శాతం పెరిగింది. నవంబర్లో ఇది 0.98 శాతం మేర తగ్గడం గమనార్హం.