IT Returns | వేతన జీవులు, బుల్లి వ్యాపారులు.. ఎగ్జిక్యూటివ్‌లు.. దాదాపు ప్రతి ఒక్కరూ తమ సంపాదనపై ప్రతియేటా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిందే. కొంత మందికి తాము కూడా ఐటీ రిటర్న్స్ సమర్పించాలా? అన్న సందేహాలు వెలువడుతుంటాయి. ఐటీ రిటర్న్స్ ఎందుకు సమర్పించాలి.. ఎలా సమర్పించాలి అన్న విషయాలు తెలుసుకుందాం..
వివిధ ఆదాయ మార్గాల నుంచి వచ్చే ఇన్‌కం ప్రాథమికంగా మినహాయింపు పరిమితి దాటితే.. ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సిందే.. ఉదాహరణకు ప్రతి వ్యక్తి తన వేతనం, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం, ఇండ్ల అద్దె మీద వచ్చే ఆదాయం కలిపి గణించాలి.
ఆదాయం పన్ను విభాగం వారి 26 ఏఎస్ లేదా ఏఐఎస్ ఫామ్ సాయంతో గమనిస్తే ఒక ఏడాదిలో వివిధ మార్గాల్లో వచ్చిన ఆదాయం వివరాలు వెల్లడవుతాయి. అలాగే మీకు వచ్చే ఆదాయం నుంచి ఆదాయం పన్నులోని వివిధ సెక్షన్లు.. 80సీ, 80సీసీడీ, 80డీ, 80జీ, 80టీటీఏ సెక్షన్ల కింద మినహాయింపునకు గల అవకాశాలు చెక్ చేసుకోవాలి.
ఇక 60 ఏండ్ల లోపు వారికి ఆదాయం పన్ను మినహాయింపు రూ.2.50 లక్షలు. 60 నుంచి 80 ఏండ్ల లోపు వారికి రూ.3 లక్షలు. 80 ఏండ్లు దాటిన వారికి రూ.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు పోగా, పన్ను వర్తించే ఆదాయం ప్రాథమిక పరిమితికి లోబడే ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షల్లోపే ఉంటే ఆదాయం పన్ను చట్టంలోని 87ఏ సెక్షన్ కింద పన్ను రాయితీ లభిస్తుంది. కానీ అటువంటి వారు తమకు వర్తించే ఐటీఆర్ ఫామ్ తప్పనిసరిగా ఐటీ విభాగానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
విదేశాల్లోని ఆస్తులపై లాభాలు ఆర్జించిన వారికి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. ఇతర దేశాల్లో నగదు లావాదేవీల్లో పాల్గొ్న్నా.. రిటర్న్స్ ఫైల్ చేయవల్సిందే. విదేశీ కంపెనీల స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో పొదుపు చేసిన వారు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి.
కరంట్ ఖాతాలో రూ.కోటి, సేవింగ్స్ ఖాతాల్లో రూ.50 లక్షలకు పైగా నగదు డిపాజిట్లు ఉంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవలిసి ఉంటుంది. ఒక ఏడాదిలో మీ ఆదాయం నుంచి మినహాయించిన పన్ను మొత్తం రూ.25 వేలు దాటినా ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సిందే.
విదేశీయానం చేసినప్పుడు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసినా.. ఐటీఆర్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. ప్రతి పన్ను చెల్లింపు దారుడు తాను, తన కుటుంబ సభ్యుల విదేశీ యానం వివరాలు తెలియచేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షకు పైగా విద్యుత్ బిల్లు చెల్లించినా.. ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి.