న్యూఢిల్లీ, మే 18: దేశంలోకి వెండి ఏ రూపంలో వచ్చినా ఆంక్షలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ముడి చమురు ధరలు, తరుగుతున్న ఫారెక్స్ రిజర్వులు, రూపాయి మారకం విలువ పతనం దృష్ట్యానే దిగుమతులపై ఈ ఆంక్షలు వచ్చిపడ్డాయి.
సర్కార్ ఆంక్షలతో దేశంలోకి వెండి దిగుమతులు తగ్గిపోతాయి. దీనివల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక మార్కెట్లో ధరలు పెరుగడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక దేశీయంగా వాడుతున్న వెండిలో 80 శాతానికిపైగా దిగుమతి అవుతున్నదే. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లోని ధరల ప్రభావం కూడా రేట్లపై ఉంటుందని చెప్తున్నారు. దేశ, విదేశీ పరిస్థితుల ప్రభావం వల్ల సమీప భవిష్యత్తులో వెండి ప్రియమేనన్న అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
వెండి దిగుమతులపై ఆంక్షల అర్థం.. భారత్‌లోకి వెండిని పూర్తిగా రాకుండా అడ్డుకుంటారని కాదని వీపీ రిసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేదీ అన్నారు. బులియన్ ఎక్సేంజ్ ద్వారా ఆర్బీఐ ఆమోదిత బ్యాంకులు, డీజీఎఫ్టీ అనుమతి పొందిన సంస్థలు, జ్యుయెల్లర్స్ ద్వారా వస్తుందని చెప్తున్నారు. అయితే డిమాండ్‌ను అందుకోవడం కష్టం కాబట్టి దేశీయ మార్కెట్లో ధరలు పెరుగడం ఖాయమన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం గమనార్హం.
ఇక సమీప కాలానికి కిలో వెండి ధర పెరిగితే రూ.3-3.50 లక్షలుగా, తగ్గితే రూ.2.65-2.60 లక్షలుగా ఉండవచ్చని ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి అన్నారు. అయితే ధరలు పతనమైతే రూ.2.50 లక్షల వద్ద బలమైన మద్దతు లభించే వీలుందని పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.1,000 పెరిగి రూ.2.76 లక్షలకు చేరుకున్నది.