Prime Minister- Union Budget | ప్రతియేటా సంప్రదాయంగా సార్వత్రిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. కానీ, కొన్ని అరుదైన సందర్భాల్లో ప్రధాన మంత్రి కూడా బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించిన దాఖలాలు ఉన్నాయి. ఆర్ధిక మంత్రిగా బడ్జెట్ సమర్పించిన వారు కొన్నేండ్ల తర్వాత ప్రధానులై సందర్భాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌కు సమర్పించేందుకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో గతంలో బడ్జెట్ సమర్పించిన ప్రధాన మంత్రుల గురించి తెలుసుకుందామా..!
పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి తొలి ప్రధాని. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి 1964లో మరణించే వరకూ ఆయన ప్రధానిగా ఉన్నారు. అంతే కాదు.. ఒకానొక సందర్భంలో తొలిసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించిన తొలి ప్రధానిగా కూడా నెహ్రూ రికార్డు సృష్టించారు. అప్పట్లో వెలుగు చూసిన ముంద్రా స్కామ్‌లో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి పాత్ర ఉందని జస్టిస్ చగ్లా కమిషన్ నిగ్గు తేల్చింది. దీంతో 1958 ఫిబ్రవరి 12న అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా ప్రధానిగా నెహ్రూ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ మంత్రిగా 1958-59 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పించారు. అటుపై ఆర్థిక మంత్రిగా నియమితులైన మొరార్జీ దేశాయ్.. 1963 ఆగస్టు వరకూ కొనసాగారు.
పండిట్ నెహ్రూ తర్వాత ఆయన కూతురు ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా 1970-71 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సమర్పించారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ 1969లో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇందిరాగాంధీ ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. దేశ తొలి మహిళా ప్రధాని కావడంతోపాటు తొలి మహిళా ఆర్థిక మంత్రిగా పని చేసిన రికార్డు కూడా ఇందిరాగాంధీ సొంతం చేసుకున్నారు. 1970-71 బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించిన తర్వాత ఏడాదికి అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి యశ్వంత్ రావ్ చవాన్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు.
1977లో జనతా పార్టీ తరఫున దేశానికి నాలుగో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన మొరార్జీ దేశాయ్.. ఆర్థిక మంత్రిగా పది వార్షిక బడ్జెట్లు సమర్పించిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఎనిమిది వార్షిక బడ్జెట్లు, రెండు ఇంటరిమ్ బడ్జెట్లను పార్లమెంట్‌కు ఆయన సమర్పించారు.
1984-89 మధ్య ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ 1987 జనవరి – జూలై మధ్య స్వల్ప కాలం ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. బోఫోర్స్ కుంభకోణం వెలుగు చూడటంతో అప్పటి ఆర్థిక మంత్రిగా విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్‌ను తొలగించారు. దీంతో ఆర్థిక మంత్రిగా 1987-88 సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు.