WhatsApp | మెటా ఆధ్వర్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్ల కోసం నిత్యం కొత్త ఫీచర్లు తెస్తూనే ఉన్నది. ప్రతి రోజూ మనం లేవగానే ఫోన్ ఓపెన్ చేస్తే వాట్సాప్‌లో ‘బండిళ్ల’ కొద్దీ మెసేజ్‌లు ఉంటాయి. వాటిల్లో ఏది ముఖ్యమైందో తెలుసుకోవడం కాసింత ఇబ్బందికరమే. వాట్సాప్ ఖాతా పైకి స్క్రోల్ చేస్తూ వెళితే గానీ ఆయా మెసేజ్‌ల్లో ముఖ్యమైనదో తెలుసుకోగలుగుతాం. కొన్ని ముఖ్యమైన అప్ డేట్స్ మిస్ అవుతూ ఉంటాం. ఇటువంటి ఇబ్బందులకు వాట్సాప్ చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్’లో కొత్తగా ‘పిన్’ ఫీచర్ తెచ్చింది.
వ్యక్తిగత చాట్లు, గ్రూప్ చాటింగ్స్ మిస్ కాకుండా వాట్సాప్ తెచ్చిన ఈ పిన్ ఫీచర్ ఉపకరిస్తుంది. ఈ ఫీచర్ ఆయా గ్రూపుల అడ్మిన్లు ఉపయోగించాల్సి ఉంటది. కేవలం టెక్ట్స్ మెసేజ్‌లు మాత్రమే కాక.. వాట్సాప్ పోల్స్, ఫోటోలు, ఎమోజీలు కూడా పిన్ చేయొచ్చు. ఇలా పిన్ చేసిన మెసేజ్.. మీ వాట్సాప్ చాటింగ్ టాప్‌లో కనిపిస్తుంది.
ఇలా పిన్ చేసిన మెసేజ్‌లు ఏడు రోజుల పాటు డిఫాల్ట్‌గా ఉంటాయి. అవసరం అనుకుంటే 24 గంటలు, 30 రోజులు ఉండేలా సెట్ చేసుకోవచ్చు. టైం అయిపోయిన తర్వాత పిన్ చేసిన మెసేజ్ అన్ పిన్ అవుతుంది. గ్రూప్ సభ్యులకు మెసేజ్‌లు పిన్ చేసి పంపడం అడ్మిన్ల చేతిలోనే ఉంటుంది.
ఏ చాట్ లో మెసేజ్ అయినా లాంగ్ ప్రెస్ చేసి.. ‘మోర్ ఆప్షన్స్’ మీద క్లిక్ చేయగానే అందులో ‘పిన్’ అనే కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకుంటే మీ మెసేజ్ పిన్ అవుతుంది. అలాగే అన్ పిన్ కూడా చేసేయొచ్చు. వాట్సాప్ తన డెస్క్ టాప్, మొబైల్ యూజర్ల కోసం తెచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి వచ్చేసింది. త్వరలో మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుంది.