WhatsApp | ప్రస్తుతం ప్రతి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ రెండు సిమ్‌లతో వస్తున్నది. ప్రతి ఒక్కరూ అఫిఫిషియల్, పర్సనల్ ఫోన్ నంబర్లు వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీపి కబురు అందించింది. వాట్సాప్ అను నిత్యం తన యూజర్లకు రోజుకో ఫీచర్ అందుబాటులోకి తెస్తున్నది.
ఒక్క ఫోన్ నంబర్ పైనే ఇప్పటి వరకూ వాట్సాప్ సేవలు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. రెండో నంబర్‌పై వాట్సాప్ వాడుకోవాలంటే.. మొదటి నంబర్ వాట్సాప్ ఖాతా నుంచి లాగౌట్ కావాల్సి ఉంటది. కానీ, కొత్తగా వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్‌తో రెండు ఫోన్ నంబర్లతో రెండు వాట్సాప్ ఖాతాలు వినియోగించుకోవచ్చునని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. త్వరలో ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకు రానున్నారు.
ఇంతకుముందు రెండు వాట్సాప్ ఖాతాలు వాడాలంటే క్లోన్ యాప్‌లు/ ఫేక్ యాప్‌లు వాడేవారు. వాట్సాప్ తాజాగా తీసుకొస్తున్న ఫీచర్‌తో క్లోన్ యాప్‌లు/ ఫేక్ యాప్‌లు వాడాల్సిన అవసరమే ఉండదు. ఒకే ఫోన్లో రెండు సిమ్ నంబర్లపై వేర్వేరు వాట్సాప్ ఖాతాలు నిర్వహించుకోవచ్చు. ఇటీవల చాలా మంది వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు ఒక వాట్సాప్, బిజినెస్, ప్రొఫెషనల్ అవసరాలకు మరో వాట్సాప్ ఖాతా వాడుతున్నారు.
వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడి వైపున పై భాగంలో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేసి.. అందులో సెట్టింగ్స్ లో క్లిక్ చేయాలి.. అకౌంట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అటుపై యాడ్ అకౌంట్ పై క్లిక్ చేసి.. వచ్చే నిబంధనలను అనుసరిస్తే సరి రెండో వాట్సాప్ ఖాతా లభిస్తుంది. వాట్సాప్ లో కుడి వైపున పై భాగంలో గల మూడు చక్కలపై క్లిక్ చేసి, కావాల్సినప్పుడు రెండు ఖాతాల మధ్య స్విచ్ కావచ్చు.