WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కస్టమర్ల కోసం రోజుకో ఫీచర్ అందుబాటులోకి తెస్తున్నది. ఇటీవలి కాలంలో పలు అడ్వాన్స్డ్ ఫీచర్లు తెచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఆప్షన్ తెచ్చింది. చాట్ ఎడిట్, చాట్ లాక్, వీడియో కాల్ సమయంలో స్క్రీన్ షేరింగ్, హెచ్డీ ఫొటో షేరింగ్, హెచ్డీ వీడియో షేర్ తదితర సరికొత్త ఫీచర్లు తెచ్చింది. ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేయడంలో వాట్సాప్ నూతన మార్పు తీసుకు వచ్చింది.
మామూలుగా వాట్సాప్‌లో ఒక గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటే.. ముందు తమ కాంటాక్ట్స్‌లోని వారిని ఎంపిక చేసుకుని దానికో పేరు పెట్టుకుంటేనే గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఏ హడావుడిలో పేరు పెట్టడం అసాధ్యం అయితే గ్రూప్ క్రియేట్ చేయలేరు. కానీ, ఇక ఆ సమస్య ఉండబోదని వాట్సాప్ వివరించింది. పేరు పెట్టుకోకుండానే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చునని వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలుపుతూ ఓ ఫొటో కూడా షేర్ చేశారు.
ఇక నుంచి గరిష్టంగా ఆరుగురు వ్యక్తులతో ఏర్పాటు చేసే వాట్సాప్ గ్రూపునకు ఇక పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అందులో సభ్యుల పేర్లను బట్టి గ్రూప్ పేరు డైనమిక్‌గా మారుతూ ఉంటుంది. కావాలనుకున్నప్పుడు తర్వాత గ్రూపుకు పేరు పెట్టుకోవచ్చు. ఇక నుంచి అడ్మిన్ మాత్రమే కాక సభ్యులు కూడా గ్రూప్ పేరు మార్చొచ్చు. కాంట్రాక్ట్ సేవ్ చేసుకోని వారి ఫోన్ నంబర్ మాత్రమే డిస్ ప్లే అవుతుంది. త్వరలో ఐఓఎస్ యూజర్లు, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది.
అంతే కాదు ఓఐఎస్ యూజర్లకు ‘వీడియో మెసేజ్’ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ‘మీరు అప్పటికప్పుడు వీడియో రికార్డ్ చేసి.. చాట్స్ ద్వారా వీడియో మెసేజ్ పంపొచ్చు’ అని వాట్సాప్ తెలిపింది. అందుకోసం మైక్రోఫోన్ ఐకాన్ పై టాప్ చేసి చాట్ నుంచి వీడియోకు స్విచ్ కావాల్సి ఉంటుంది. వీడియో కాల్స్‌లో స్క్రీన్ షేరింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా లభిస్తుంది.