Cashless Claim | కరోనా మహమ్మారి తర్వాత దాదాపు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో అందుబాటులో ఉన్న నగదు రహిత (Cash Less) వైద్య చికిత్స పాలసీదారులకు ఎంతో ఉపకరిస్తున్నాయి. గతంలో అనారోగ్యంతో దవాఖానకు వెళ్తే.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా ఒక్కోసారి వైద్య చికిత్స బిల్లు చెల్లించాల్సి వచ్చేది. తర్వాత రీయింబర్స్ మెంట్ క్లయిమ్ చేసుకున్నా.. దవాఖానలో బిల్లు చెల్లింపునకు అవసరమైన మనీ కోసం నానా పాట్లు పడేవారు. కానీ ఇప్పుడలా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
క్యాష్ లెస్ క్లయిమ్ పేమెంట్స్ ద్వారా ఇన్సూరెన్స్ సంస్థలే నేరుగా దవాఖానలకు బిల్లులు పే చేస్తున్నాయి. అయినా, కొన్ని సందర్భాల్లో క్యాష్ లెస్ క్లయిమ్‌లు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయో చూద్దామా..!
క్యాష్ లెస్ క్లయిమ్ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలంటే పాలసీదారు.. సంబంధిత సంస్థ నెట్ వర్క్ దవాఖానలో మాత్రమే చికిత్స పొందాలి. నాన్-నెట్ వర్క్ దవాఖానలో అడ్మిట్ అయితే క్యాష్ లెస్ క్లయిమ్ అవకాశం ఉండదు. రీయింబర్స్ మెంట్ కోసం బిల్లును ఇన్సూరెన్స్ సంస్థకు పంపాల్సిందే.
పాలసీ దారుడు సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థ నెట్ వర్క్ పరిధిలోని దవాఖానలో చికిత్స కోసం చేరినా క్యాష్ లెస్ క్లయిమ్ పొందడానికి అనుమతి కోరుతూ ముందే ఫ్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ పంపాలి. అందుకు వివిధ వైద్య పరీక్షల నివేదికలు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తదితర పాలసీదారుడి మెడికల్ పత్రాలు పంపాలి. అలా మీరు పంపిన పత్రాల్లో తప్పులు ఉన్నా, అసంపూర్ణంగా ఉన్నా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇన్సూరెన్స్ కంపెనీ, పాలసీ లిస్టులో తెలిపిన వ్యాధులకే కవరేజీ ఇస్తుంది. జాబితాలో లేని జబ్బు చికిత్స కోసం దవాఖానలో చేరినా.. క్లయిమ్‌లు తోసిపుచ్చుతుంది. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు అందులో కల్పించే వ్యాధుల చికిత్స వివరాలు చెక్ చేసుకోవాలి.
ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ తర్వాతే ఇన్సూరెన్స్ సంస్థలు కవరేజీ ఇస్తాయి. ముందుగా నిర్థారించిన వ్యాధి చికిత్స కోసం వెయిటింగ్ పీరియడ్ కంటే ముందే దవాఖానలో చేరినప్పుడు సబ్మిట్ చేసే క్లయిమ్‌ను ఇన్సూరెన్స్ సంస్థ తోసిపుచ్చుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో క్యాష్ లెస్ క్లయిమ్‌లకు కూడా చాన్స్ ఉండదు.
చికిత్స కోసం నెట్ వర్క్ దవాఖానలో చేరే వారు.. సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థకు ఆ నెట్ వర్క్ దవాఖాన నిర్ణీత గడువులోగా ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ పంపాలి. అలా చేయకుంటే క్యాష్ లెస్ క్లయిమ్ రిజక్ట్ అయ్యే చాన్స్ ఉంటుంది. క్లయిమ్ అప్పీల్ పరిష్కారానికి సంబంధిత పాలసీదారుతో ఇన్సూరెన్స్ సంస్థ సంప్రదించవచ్చు. బీమా సంస్థలో మీ సంప్రదింపుల వివరాలు తప్పుగా రికార్డైనా.. అసంపూర్తిగా ఉన్నా, అప్ డేట్ చేయకున్నా .. క్యాష్ లెస్ క్లయిమ్‌లు రిజెక్ట్ చేయొచ్చు.
క్యాష్ లెస్ క్లయిమ్ పొందడానికి అర్హులైనా, కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ సంస్థ.. నగదు రహిత చికిత్స క్లయిమ్ అనుమతించకపోతే దవాఖానలో ముందు బిల్లు చెల్లించి, తర్వాత రీయింబర్స్ మెంట్ ద్వారా క్లయిమ్ దాఖలు చేయవచ్చు.
అయితే, ముందే మీరు దవాఖానలో చేరిన సంగతి సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థకు తెలపాలి. వ్యాధి చికిత్స పూర్తయిన తర్వాత దవాఖాన నుంచి డిశ్చార్జి అయినప్పుడు దవాఖాన బిల్లులు, మెడికల్ రిపోర్ట్లు, ప్రిస్క్రిప్షన్ తదితర పత్రాలు సేకరించాలి. అటుపై ఆరోగ్య బీమా క్లయిమ్ ఫామ్ పూర్తి చేసి, పాలసీ పత్రాలు, దవాఖానలో సేకరించిన పత్రాలన్నీ బీమా సంస్థకు సబ్మిట్ చేయాలి. క్లయిమ్ ఫామ్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. బీమా సంస్థ ఈ పత్రాలు స్వీకరించాక, పరిశీలించి క్లయిమ్ పరిష్కరిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారికి క్యాష్ లెస్ క్లయిమ్‌లు సౌలభ్యంగా ఉంటాయి. వైద్య చికిత్స ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కావాల్సిన పత్రాల కోసం దవాఖాన కోసం, క్లయిమ్ సెటిల్మెంట్ కోసం ఇన్సూరెన్స్ సంస్థ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారు క్యాష్ లెస్ క్లయిమ్ దాఖలు చేసే విషయమై జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హితవు చెబుతున్నారు.