హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 38వ జాతీయ పుస్తక ప్రదర్శనలో తెలంగాణ పబ్లికేషన్స్‌కు స్టాల్స్ ఇవ్వకుండా నిరాకరించడం బాధాకరమని తెలంగాణ కవులు, రచయితలు, సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం సాహితీవేత్తలు నందిని సిధారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, పనునూరి రవీందర్, దేశపతి శ్రీనివాస్, అన్నవరం దేవేందర్, ఎన్వీ రమణ, ప్రసేన్, నల్లమోతు తిరుమలరావు, ఐవీ రమణారావు, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, విప్లవ్‌కుమార్, రమేశ్ విజ్ఞానదర్శిని, వెన్నెల సత్యం, ఆస్కాని మారుతిసాగర్, డీ పాపారావు, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, కే లక్ష్మణ్‌గౌడ్, ఉదారి నారాయణ, కేపీ అశోక్‌కుమార్, జనజ్వాల, ఎస్ రఘు, కొండూరి వీరయ్య, రమేశ్ హజారి, వనపట్ల సుబ్బ య్య, దామోదర్ ఊటుకూరు, మోత్కూరి శ్రీనివాస్, నరేశ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ అస్తిత్వం, చైతన్యంతో జాతీయ పుస్తక ప్రదర్శనగా రూపుదిద్దుకున్న బుక్ ఫెయిర్‌లో తెలంగాణ స్టాళ్ల ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడం ఆవేదనకు గురిచేస్తున్నదని పేర్కొన్నారు. 12 ఏండ్లుగా కొనసాగుతున్న ఈ పుస్తక ప్రదర్శనలో ఇలాంటి అప్రజాస్వామిక ధోరణి ఏనాడూ కనిపించలేదని చెప్పారు. వ్యక్తుల మధ్య అంతర్గత విబేధాలు ఉంటే సొసైటీలో మాట్లాడుకోవాలని హితవు పలికారు.