న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఆచితూచి ఖర్చు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు పెట్టే ఖర్చులు.. తర్వాతి రోజుల్లో ఇబ్బందులకు దారితీయవచ్చు. కాబట్టి ప్రాధాన్యతలు, అవసరాలను తెలుసుకొని ఖర్చు పెడితే శ్రేయస్కరం. ఇక కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు అనేక డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూనే ఉంటారు. అయితే కొనే ముందు అది ఏ మేరకు అవసరమన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాగా, క్రెడిట్ కార్డు ఉందికదా అని విపరీతంగా వాడేయవద్దు. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డులు అనవసరపు ఖర్చులకు దారితీసే ప్రమాదం కూడా ఉన్నది. ఈఎంఐ ఆప్షన్ ఉందని కొనుగోళ్లకు దిగవద్దు. ఎందుకంటే ఒకేసారి నగదు భారం ఉండకపోవడంతో అవసరం లేకపోయినా కొనే వీలున్నది.