మీ బీమా కంపెనీ క్యాష్‌లెస్ ఫీచర్‌ను ఆఫర్ చేసూ, మీ వద్ద క్యాష్‌లెస్ కార్డ్ ఉంటే నెట్వర్క్ హాస్పిటల్లో చేరేందుకు.. ఎమర్జెన్సీల్లో కూడా డబ్బు చెల్లించాల్సిన అవసరమే లేదన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఇది ఏమిటని మీరు అడగవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రాధమిక అంశాలు అర్థం చేసుకుందాం..
గతంలో మీ కుటుంబంలో ఎవరైనా దవాఖానాల్లో చేరితే, బిల్లును తొలుత మీ జేబులోంచి పెట్టుకొని, తర్వాత ఆరోగ్య బీమా కంపెనీ నుంచి ఆ ఖర్చుల్ని క్లెయిం చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను రీయింబెర్స్‌మెంట్ క్లెయింగా వ్యవహరిస్తారు. అయితే ఇది చాలా కాలం క్రితం.. నగదు రహిత సదుపాయాన్ని ప్రవేశపెట్టక ముందు అమల్లో ఉండేది. ఇప్పుడు ఆరోగ్య బీమా కంపెనీల చెంత హాస్పిటళ్ల నెట్వర్క్ జాబితా ఉంటుంది. మీ క్లెయింను కంపెనీ త్వరితంగా ఆథరైజ్ చేసి, ఆమోదిస్తుంది. హాస్పిటల్‌కే నేరుగా చికిత్సకయ్యే మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ ప్రక్రియను క్యాష్‌లెస్ క్లెయింగా వ్యవహరిస్తారు.
క్యాష్‌లెస్ క్లెయిం వాగ్దానం ఏమిటి?
క్లెయిం సెటిల్మెంట్ను సులభంగా, త్వరితంగా చేయనున్నట్లు క్యాష్‌లెస్ క్లెయిం ప్రక్రియ వాగ్దానం చేస్తుంది. అంటే క్యాష్‌లెస్ ఆధారంగా క్లెయిం చేయాలనుకుంటే మీరు మొత్తాల్ని ఏర్పాటు చేసుకోనవసరం లేదు. చాలా ఫారాలను నింపే బాధ తప్పుతుంది. బీమా కంపెనీ, హాస్పిటల్ నేరుగా సంభాషించుకుని, డాక్యుమెంట్లు మార్పిడి చేసుకుంటాయి.
క్లెయిం ఎలా పనిచేస్తుంది?
మీ హెల్త్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్, పాలసీ డాక్యుమెంట్లు తదితరాలు ఇవ్వమని హాస్పిటల్ డెస్క్ మిమ్మల్ని అడుగుతుంది. అటుతర్వాత వారు వాటిని నేరుగా బీమా కంపెనీకి పంపిస్తారు.
ఇన్సూరెన్స్ కంపెనీ ఆ పత్రాలు అన్నింటినీ సరిచూసుకుని, తాము ఎంత మొత్తాన్ని చెల్లిస్తామో తెలియచేస్తూ ప్రి ఆథరైజేషన్ ఇస్తుంది. అంటే చికిత్సకు అయ్యే ఖర్చును చెల్లిస్తామన్న తొలి వాగ్దానమే ఈ ప్రి-ఆథరైజేషన్. ఆ తర్వాత హాస్పిటల్లో చేరి, అవసరమైన చికిత్సను తీసుకోవచ్చు.
హాస్పిటల్ నుంచి డిఛార్జ్ చేసేముందు, తుది బిల్లును బీమా కంపెనీకి హాస్పిటల్ పంపిస్తుంది. ఆ మొత్తాన్ని హాస్పిటల్‌కు ఫైనల్ ఆథరైజేషన్‌ను ఇన్సూరెన్స్ కంపెనీ జారీచేస్తుంది.
అయితే బీమా కంపెనీ అనుమతించని కొన్ని వ్యయాల్ని మీరే చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వాగ్దానం, ప్రక్రియను పరిశీలించిన మీదట.. హాస్పిటలైజేషన్ అవసరమైతే డబ్బు కోసం పరుగులు తీయాల్సిన పని లేదని మీరు అనుకోవచ్చు.
కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ఎమర్జెన్సీల్లో క్యాష్‌లెస్ పనిచేయకపోవచ్చు. పైన వివరించిన క్యాష్‌లెస్ ప్రక్రియే ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్లలోనూ వర్తిస్తుంది. కానీ సమయాభావం కారణం గా ఇది నిరుపయోగమవుతుంది. ఎందుకంటే….
ప్రి- ఆథరైజేషన్‌ను ఇవ్వడానికి బీమా కంపెనీలు 6 నుంచి 24 గంటలు సమయం తీసుకుంటాయి. మీ పాలసీ కవరేజ్‌ను, మీకు అవసరమైన చికిత్స పాలసీ షరతులు తదితరాల ప్రకారం కవర్ అయినదీ, లేనిదీ కంపెనీ వ్యక్తులే పరిశీలిస్తారు.
ప్రి-ఆథరైజేషన్ లేకుండా హాస్పిటల్స్ అడ్మిట్ చేసుకోవు. కాబట్టి క్యాష్‌లెస్ కార్డ్ ఉన్నా, హాస్పిటల్లో చేరేందుకు అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే చికిత్స ప్రారంభమౌతుంది.
ఇన్సూరెన్స్ కంపెనీ గానీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) గానీ క్లెయింలను 24×7 ప్రాసెస్ చేస్తాయి. కానీ హాస్పిటళ్లలో క్లెయింలను హ్యాండిల్ చేసే ఇన్సూరెన్స్ డెస్క్‌లు 24×7 పనిచేయవు. సాధారణంగా 12 గంటలు మాత్రమే తెరిచి ఉంటాయి. సెలవు రోజుల్లో మూసిఉంటాయి. ఈ సమయంలో హాస్పిటల్లో చేరాల్సి వస్తే, చికిత్సను ప్రారంభించడానికి అడ్వాన్స్ చెల్లించాలంటూ హాస్పిటల్ డిమాండ్ చేయవచ్చు.