Billionaires | న్యూఢిల్లీ, డిసెంబర్ 7: శ్రీమంతులు అడ్డాగా భారత్ మారిపోతున్నది. ప్రతియేటా దేశవ్యాప్తంగా బిలియనీర్లు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను భారత్‌లో 185 మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నట్లు యూబీఎస్ తన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే సంపన్నవర్గాలు 21 శాతం మంది పెరిగారని, వీరి మొత్తం సంపద 905.6 బిలియన్ డాలర్లు లేదా రూ.75.19 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నదని పేర్కొంది. నికరంగా వీరి సంపద 42 శాతం ఎగబాకిందని తెలిపింది.
ప్రపంచ దేశాల శ్రీమంతుల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నదని వెల్లడించింది. 835 మందితో అమెరికా తొలిస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానంలో చైనా 427 మంది ఉన్నట్లు యూబీఎస్ తన తాజా బిలియనీర్ల నివేదికలో తెలిపింది. ప్రస్తుత సంవత్సరంలో కొత్తగా 32 మంది బిలియనీర్ల జాబితాలోకి చేరారని తెలిపింది. 2015 నుంచి శ్రీమంతుల సంఖ్య 123 శాతం చొప్పున పెరగడం విశేషం. కుటుంబ వ్యాపారాలు వారీ సంపద పెరగడానికి కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా భారత్‌లో ఇంచుమించు అన్ని వ్యాపారాల్లో కుటుంబ బిజినెస్‌లు అధికంగా ఉన్నాయని వెల్లడించింది.
అగ్రగామి దేశాలైన అమెరికా, భారత్‌లో బిలియనీర్లు పెరుగుతుండగా, అదే చైనాలో మాత్రం తగ్గుముఖం పడుతున్నారు. చైనాలో కుబేరుల సంఖ్య 93 మంది తగ్గారని నివేదిక పేర్కొంది. మొత్తం సంపద 1.8 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.4 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. కానీ, అమెరికాలో బిలియనీర్ల సంపద 4.6 ట్రిలియన్ డాలర్ల నుంచి 5.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. మరోవైపు, 2015లో అంతర్జాతీయంగా 1,757 మంది బిలియనీర్లు ఉండగా, ప్రస్తుతం వీరి సంఖ్య 2,682కి చేరుకున్నారు. మొత్తంగా వీరి సంపద 6.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది.
2015 నుంచి 2020 వరకు బిలియనీర్ల సంపద 10 శాతం పెరగగా, 2020 నుంచి ఒక్క శాతానికి పరిమితమైందని తెలిపింది. గడిచిన పదేండ్లలో టెక్ బిలియనీర్లు భారీగా సంపదను సృష్టించారని, 2015లో 788.9 బిలియన్ డాలర్లుగా ఉన్న వీరి సంపద, 2024 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, ఫిన్‌టెక్, 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్ వంటి విభాగాలు దూసుకుపోవడం వీరికి కలిసొచ్చింది. అలాగే పారిశ్రామికవేత్తల సంపద కూడా 480.4 బిలియన్ డాలర్ల నుంచి 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, రియల్ ఎస్టేట్‌కు చెందిన కుబేరుల సంపద కూడా 534 బిలియన్ డాలర్ల నుంచి 692.3 బిలియన్ డాలర్లకు చేరింది.
పట్టణాల్లో ఆర్థిక అసమానతల మధ్య అంతరం అంతకంతకు పెరుగుతున్నది. ఒకవైపు మధ్యతరగతి కుటుంబాలు తగ్గిపోతుండగా, మరోవైపు సంపన్న వర్గాలు అంతకంతకు పెరుగుతున్నారని నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2024లో సంపన్న వర్గాలు 86 శాతం మంది పెరగగా, ఇదే సమయంలో దిగువ, దిగువ మధ్యతరగతి కుటుంబాలు 25 శాతం తగ్గుముఖం పట్టారు.
ఈ ప్రభావంతో ఎఫ్ఎంసీజీ రంగంపై తీవ్ర స్థాయిలోప్రభావం చూపుతున్నదని కాంతార ఇండియా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. లగ్జరీ, మధ్యతరగతి కుటుంబాల మధ్య పెరుగుతున్న అంతరంతో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు భారీగా పడిపోయాయని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి ఆదాయం తగ్గుముఖం పడుతుండటంతో వినియోగదారులు విశ్వాసం సన్నగిల్లుతున్నదని, దీంతో పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సేల్స్ గణనీయంగా పడిపోయాయని ఇన్సైట్స్, దక్షిణాసియా ఎండీ సౌమ్య మోహంతీ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే అమ్మకాలు గణనీయంగా తగ్గాయని దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజాలైన హెచ్‌యూఎల్, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ వర్గాలు ఆందోళన వ్యక్తంచేశాయి. పట్టణాల్లో సంపన్న వర్గాలు పెరిగినప్పటికీ కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని, అదే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గుముఖం పట్టినప్పటికీ గత త్రైమాసికంలో ఇక్కడ అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు.