Vivo G2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో జీ2 ఫోన్‌ను శుక్రవారం చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.56-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుందీ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 15వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఓర్జిన్ ఓఎస్3 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఎప్పుడు ఆవిష్కరిస్తుందని వెల్లడించలేదు.
వివో జీ2 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.14 వేలు (1199 చైనా యువాన్లు) పలుకుతుంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.17,500 (1499 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.18,700 (1599 చైనా యువాన్లు) పలుకుతుంది. టాప్ హై ఎండ్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.22 వేలు (1899 చైనా యువాన్లు) పలుకుతుంది. స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో మాత్రమే లభిస్తుందీ ఫోన్.
వివో జీ2 ఫోన్ 13-మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఎఫ్/ 2.2 అపెర్చర్.. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై5, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్ ఫ్లిక్కర్ సెన్సర్ ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.