న్యూఢిల్లీ : విస్తారా ఎయిర్‌లైన్స్ ఫ్రీడం ఫేర్స్ ప్రోగ్రాం కింద ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లెక్సి ఫేర్స్ పేరుతో ప్రామాణిక ఛార్జీలపై రూ. 499 చెల్లించే ప్రయాణికులకు పలు వెసులుబాట్లు కల్పించింది. ఈ అడిషనల్ ఛార్జీ కేవలం ఎకానమీ, ప్రీమియం ఎకానమీ కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు వర్తించదు అని విస్తారా ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ఫ్రీడం ఫేర్స్ ప్రోగ్రామ్‌ను విస్తారా ఎయిర్‌లైన్స్ 2018, జులై నెలలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఫ్లెక్సీ ఫేర్స్ ఆఫర్లో భాగంగా ప్రామాణిక ఛార్జీలపై అదనంగా రూ. 499 చెల్లించిన ప్రయాణికులు.. అదనంగా 5 కేజీల లగేజీ వరకు ఉచితంగా అనుమతిస్తారు. విమానం బయల్దేరే 24 గంటల ముందు వరకు ఫ్లైట్ బుకింగ్స్‌లో మార్పు చేసుకోవచ్చు. 72 గంటల ముందు వరకు ఎకానమీ క్లాస్ ప్రయాణికులు ఫ్లైట్ బుకింగ్‌లో ఒక మార్పు చేసుకోవచ్చు. 48 గంటల ముందు వరకు ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణికులు బుకింగ్స్‌లో రెండు మార్పులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది విస్తారా ఎయిర్‌లైన్స్. ఈ ఆఫర్ నేటి నుంచి అమల్లోకి రానుంది.