Massive Lay-Offs | బెటర్ డాట్ కాం.. డిజిటల్ మార్టగేజ్ లెండర్.. దీనికి ఇండో అమెరికన్ విశాల్ గార్గ్ సీఈవోగా ఉన్నారు. మరో 24 గంటల్లో నాలుగు వేల మంది సిబ్బంది.. అంటే దాదాపు సగం మందిని ఇంటికి పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం. అమెరికా, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా బెటర్‌డాట్ కాం పని చేస్తున్నది. న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థలో జూమ్ కాల్లో తొమ్మిది శాతం (900) మందిని ఇదే సీఈవో విశాల్ గార్గ్ సాగనంపడం అప్పట్లో వైరలైంది.
భారీ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని ఈ నెల ప్రారంభంలోనే నిర్ణయించినా.. ముందే తేదీలు లీక్ కావడంతో సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బెటర్ డాట్ కాం సంస్థలో మెజారిటీ ఉద్యోగులు సేల్స్, ఆపరేషన్ కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారు. సుమారు 4,000 మందిని తొలగిస్తే, సంస్థ పని తీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
మూడు నెలల క్రితం అంటే గత ఏడాది డిసెంబర్లో కేవలం జూమ్ కాల్లో 900 మందిని తొలగిస్తున్నట్లు సీఈవో విశాల్ గార్గ్ చేసిన ప్రకటనపై పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కినుక వహించారు. గత మూడు నెలలుగా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు బెటర్ డాట్‌కామ్‌కు గుడ్‌బై చెప్పేశారు. సాఫ్ట్ బ్యాంక్, అరోరా అక్విజిషన్ కార్పొరేషన్ నుంచి ఈ సంస్థకు 750 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాక సిబ్బందిని తొలగిస్తూ విశాల్ గార్గ్ నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ లేఆఫ్‌లకు ముందు సంస్థలో 9,100 మంది ఉద్యోగులు పని చేస్తుండే వారు. జూమ్ కాల్ తర్వాత నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ఈ వార్త పతాకశీర్షికలకు ఎక్కడంతో సంస్థ సీఈవో విశాల్ గార్గ్ క్షమాపణ చెప్పారు. దీనిపై పలు రకాల మీమ్లతో సోషల్ మీడియా హోరెత్తిదింది. అయితే, ఆ తర్వాత కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ విభాగాల్లో పని చేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థకు గుడ్‌బై చెప్పారు.