లక్నో, ఫిబ్రవరి 6: ఉత్తరప్రదేశ్ విద్యుత్తు పంపిణీ సంస్థ మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ (ఎంవీవీఎన్ఎల్).. అదానీ గ్రూప్ స్మార్ట్ మీటర్ల బిడ్‌ను రద్దు చేసింది. ఎంవీవీఎన్ఎల్కు దాదాపు 7.5 మిలియన్ల స్మార్ట్ మీటర్లు సరఫరా చేసేలా అదానీ గ్రూప్ ఓ ప్రాజెక్టును దక్కించుకున్నది. అయితే ఇందుకు సంబంధించి వేసిన రూ.5,400 కోట్ల బిడ్‌ను తాజాగా ఈ డిస్కం రద్దు చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్లే ఈ నిర్ణయమని ఈ మేరకు విడుదలైన ఓ ప్రకటనలో డిస్కం పేర్కొన్నది. నిజానికి అదానీ గ్రూప్‌దే ఈ బిడ్డింగ్‌లో అత్యంత తక్కువని చెప్తున్నారు. ఒక్కో స్మార్ట్ మీటర్‌కు రూ.10,000లుగా అదానీ కోట్ చేసిందని సమాచారం. అయినప్పటికీ బిడ్ రద్దు కావడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నదిప్పుడు.
నాలుగు డిస్కంలలో..
ఇక యూపీలోని మధ్యాంచల్, దక్షిణాచల్, పూర్వాంచల్, పశ్చిమాంచల్ డిస్కంలు.. 25 మిలియన్లకుపైగా స్మార్ట్ మీటర్ల సరఫరా కోసం టెండర్లను పిలిచాయి. వీటి విలువ రూ.25,000 కోట్లుగా ఉంటుందని అంచనా. అదానీ, జీఎమ్మార్, ఎల్అండ్టీ, ఇంటెల్లీస్మార్ట్ ఇన్ఫ్రా కంపెనీలు పోటీపడ్డాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ నాలుగు కంపెనీల్లో ఏ ఒక్కటీ స్మార్ట్ మీటర్ల తయారీదారు కాకపోవడం. దీంతో బిడ్డింగ్ గెలిస్తే ఈ కంపెనీలు ఇతర సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇస్తాయన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే యూపీ విద్యుత్తు వినియోగదారుల ఫోరం ఈ బిడ్డింగ్‌ను ఆ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సవాల్ చేసింది. స్మార్ట్ మీటర్ల కోసం అన్ని కంపెనీలు భారీగా బిడ్డింగ్ వేశాయని ఫోరం ఆరోపించింది.
కారణం అదేనా..
హిండెన్‌బర్గ్-అదానీ గ్రూప్ వ్యవహారం పార్లమెంట్‌దాకా పాకడంతోనే ఆఘమేఘాల మీద ఎంవీవీఎన్ఎల్ అదానీ బిడ్డింగ్‌ను రద్దు చేసిందా? అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నది బీజేపీ సర్కారే కాబట్టి అదానీ బిడ్ విజయం సాధించిందని అంటున్నారు. నిజానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ స్టాండింగ్ బిల్లింగ్ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో మీటర్ విలువను రూ.6,000లుగానే పరిగణిస్తున్నారు. అయినప్పటికీ రూ.10,000లతో బిడ్ చేసిన అదానీకి టెండర్ దక్కడం గమనార్హం. మరోవైపు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటరింగ్ కోసం అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ నియామకానికి ఎంవీవీఎన్ఎల్ మళ్లీ ఈ-టెండర్ పిలిచే వీలున్నటు చెప్తున్నారు. మిగతా డిస్కంలు కూడా ఇదే బాటలో పయనించే వీలుందని అంటున్నారు.