Disney+Hotstar | వినోద రంగ మార్కెట్లో పోటాపోటీగా వాతావరణం నెలకొనడంతో ఓటీటీ సంస్థలు తమ కస్టమర్ల పాస్ వర్డ్ షేరింగ్ అంశంపై కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. యూజర్లు తమ పాస్వర్డ్లు షేర్ చేయాలంటే అదనపు చెల్లింపులు తప్పనిసరి చేస్తూ ఇటీవల నెట్ఫ్లిక్స్ నిర్ణయం తీసుకున్నది. తద్వారా పాస్ వర్డ్ షేరింగ్ ద్వారా జరిగే నష్టాన్ని నెట్ఫ్లిక్స్ భర్తీ చేసుకోనున్నది.
నెట్ఫ్లిక్స్ దారిలోనే డిస్నీ+ హాట్ స్టార్ ప్రయాణిస్తున్నట్లు సమాచారం. డిస్నీ+ హాట్ స్టార్ సైతం కస్టమర్లు తమ పాస్ వర్డ్ షేరింగ్ చేస్తే అదనపు చార్జీలు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ పాస్ వర్డ్ షేరింగ్ కోసం కొత్త ప్లాన్ ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. వచ్చే నెల నుంచి డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లు తమ పాస్ వర్డ్ షేర్ చేసుకుంటే అదనపు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తున్నది.
డిస్నీ+ హాట్ స్టార్ యూజర్ ఖాతాను మరొకరు షేర్ చేసుకోకుండా నివారించేందుకు సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ హ్యూ జాన్స్టన్ సరికొత్త ప్రయత్నం చేశారు. యూజర్ల ఖాతాను ఇతరులు షేర్ చేసుకుంటే.. వారి సొంతఖాతా కోసం ‘సైన్ అప్’ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని సమాచారం. వచ్చే నెల నుంచి యూజర్ల పాస్ వర్డ్ షేరింగ్ విధానానికి డిస్నీ+ హాట్ స్టార్ అడ్డుకట్ట వేయనున్నదని తెలుస్తున్నది.