US Tariffs | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించనున్నారన్న నివేదికల మధ్య ఏప్రిల్ తొలివారంలో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిపారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) డేటా ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4 మధ్య రూ.10,355 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి, సుంకాల నేపథ్యంలో మార్కెట్లకు ఉన్న పొంచి ఉన్న ముంపు నేపథ్యంలో అమ్మకాలు జరిగాయి. మార్చిలో ఎఫ్‌పీఐ అమ్మకాలు ఫిబ్రవరిలో కంటే చాలా తక్కువగా ఉన్నాయి. మార్చిలో మొత్తం అమ్మకాలు ఫిబ్రవరిలో రూ.34,574 కోట్లతో పోలిస్తే.. రూ.3,973 కోట్లకు తగ్గాయి. కానీ, ఏప్రిల్ తొలివారంలోనే ప్రపంచ మార్కెట్లో గందరగోళం మొదలైంది. దాంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఈ క్రమంలో మళ్లీ అమ్మకాలు ప్రారంభించారు. అయితే, విదేశీ పెట్టుబడిదారులంతా కేవలం భారత్‌లో మాత్రమే అమ్మకాలు జరుపుతున్నారని కాదు. సుంకాలు ప్రకటించిన రెండు రోజుల్లోనే యూఎస్ మార్కెట్ మాత్రమే దాని మొత్తం మార్కెట్ క్యాప్‌లో దాదాపు 5.4 ట్రిలియన్ డాలర్లను కోల్పోయింది.
మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా మాట్లాడుతూ.. సమీప భవిష్యత్‌లో భారత మార్కెట్లలో బలమైన విదేశీ పెట్టుబడుల ప్రవాహనం కొనసాగే అంచనా లేదన్నారు. ట్రంప్ సుంకాలతో ఏర్పడిన గందరగోళం కొంత వరకు తగ్గుముఖం పట్టే వరకు మార్కెట్లో పెట్టుబడులు ఇప్పుడే ఉంటాయని ఆశించడం లేదన్నారు. పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెరుపడేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని.. అయితే, భారత్ అమెరికాతో ఇతర దేశాల మధ్య జరుగుతున్న ప్రధాన వాణిజ్య చర్చలు త్వరలో ముగిస్తే ప్రస్తుత పరిస్థితి వేగంగా మారేందుకు ఛాన్స్ ఉంటుందన్నారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగయ్యేందుకు నెలల సమయం పటవచ్చని.. అయితే, సుంకాలు భారతదేశంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం లేదని బగ్గా తెలిపారు. అమెరికాకు చేసే 80 బిలియన్ డాలర్ల భారత ఎగుమతులు భారత ఆర్థిక వ్యవస్థ స్థాయి 4.2 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే.. చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం అస్థిరత ఉన్నప్పటికీ, భారత ఈక్విటీ మార్కెట్లు ప్రాథమికంగా బలంగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కానీ, ప్రపంచ మార్కెట్లో అస్థిరత నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు భారీగా ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి.