హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : ఏరోస్పెస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నత స్థాయి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. గురువారం సచివాలయంలో ‘యూఎస్ నేషనల్ కాలేజ్ వార్’ బృందం సభ్యులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఇక్కడి అనుకూలతలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. రాకెట్ల తయారీ నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడిభాగాల నుంచి శాటిలైట్ల వరకు అన్నింటిలోనూ ‘మేడిన్ తెలంగాణ’ మార్క్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్నదన్నారు.
ఈ రంగంలో రాష్ట్రం ఏటా 30 శాతానికి పైగా వృద్ధి రేటు నమోదు చేస్తున్నట్టు వివరించారు. మరోవైపు, పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కేవలం 30 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.