Air India Pee Gate | మహిళా ప్రయాణికురాలిపై మరో ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటన విషయమై డీజీసీఏ నిర్ణయంపై ఎయిర్ ఇండియా తప్పుబట్టింది. గత నవంబర్ 26న జరిగిన ఈ ఘటనకు పైలట్ లైసెన్స్ రద్దు చేయడం అతిశయంగా ఉందని మంగళవారం పేర్కొంది. పైలట్ తన విధుల నిర్వహణలో విఫలమైనందుకు ఆయన లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తమ పైలట్‌కు మద్దతునిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.
డీజీసీఏ నిర్ణయంపై ఆరు ఎయిర్ ఇండియా ఉద్యోగ సంఘాలు కూడా రియాక్టయ్యాయి. పైలట్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ డీజీసీఏ తీవ్రమైన శిక్ష విధించిందని పేర్కొన్నాయి. ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని మంగళవారం సంయుక్త పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ సమర్పించిన వారిలో ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ఇండియా పైలట్స్ గిల్డ్, ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్, ఎయిర్ కార్పొరేషన్స్ ఎంప్లాయీస్ యూనియన్, ఆల్ ఇండియా క్యాబిన్ క్రూ అసోసియేషన్ ఉన్నాయి.
వెల్స్ ఫార్గో మాజీ వైస్‌ప్రెసిడెంట్ శంకర్ మిశ్రా గత నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు సహ మహిళా ప్రయాణికురాలిపైనే మూత్రం పోశాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ సదరు విమాన పైలట్ మూడు నెలలు సస్పెండ్ చేస్తూ ఈ నెల 20న ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్‌లైన్స్ డైరెక్టర్ ఇన్‌ఫ్లయిట్ సర్వీసెస్‌పై రూ.3 లక్షలు, డీజీసీఏ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. వారంలోపే జరిగిన మరో ఘటన జరిగినా స్పందించనందుకు మహారాజా పై డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది.