UPI Payments | ఇప్పుడంతా ఫోన్‌పే, గూగుల్ పే, భారత్‌పే, పేటీఎం వంటి మొబైల్ యాప్స్ ద్వారా ఆన్ లైన్లో క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. రోజురోజుకు డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్బీఐ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది. దవాఖానలు, విద్యా సంస్థల్లో ఆన్లైన్, రికరింగ్ చెల్లింపుల పరిమితి పెంచేయాలని నిర్ణయించింది. ఇంతకుముందు రూ.లక్ష వరకు మాత్రమే పరిమితి ఉండేది. దాన్ని రూ.5 లక్షలకు, ఈ-రికరింగ్ పేమెంట్స్ పరిమితి రూ.లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. వివిధ క్యాటగిరీల్లో నిర్ధిష్ట గడువులోపు యూపీఐ పేమెంట్స్ పరిమితిని సమీక్షిస్తామని తెలిపారు.
తాజాగా విద్యా, ఆరోగ్య రంగ సేవల కోసం చెల్లింపుల పరిమితి పెంచడం వల్ల కస్టమర్లకు చేయూత లభిస్తుందన్నారు. ప్రస్తుతం రూ.15 వేలపై చిలుకు రికరింగ్ ట్రాన్సాక్షన్లకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) అవసరం. కానీ తాజాగా ఆ పరిమితిని రూ.లక్ష వరకూ పెంచుకున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. దీనివల్ల మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ పేమెంట్, క్రెడిట్ కార్డు రీపేమెంట్స్కు సహాయకారిగా ఉంటుందని చెప్పారు.