Edible Oils | వంట నూనెల దిగుమతిపై సుంకం పెంచడాన్ని ఆసరాగా చేసుకుని వంట నూనెల ధరలు పెంచొద్దని వంట నూనెల తయారీ సంస్థలకు కేంద్రం సూచించింది. సుంకం పెంచడం వల్ల దిగుమతి తగ్గి దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే తక్కువ సుంకంతో దిగుమతి చేసుకున్న వంట నూనెల నిల్వలు అవసరాలకు సరిపడా ఉన్నాయని కేంద్రం వివరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 30 లక్షల టన్నుల స్టాక్ దాదాపు రెండు నెలల అవసరాలకు సరిపోతాయని, ధరలు పెంచొద్దని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ వ్యాఖ్యానించింది.
చౌక దిగుమతులతో దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్నాయి. దీంతో దేశీయ రైతులకు లబ్ధి చేకూర్చడానికే ఇటీవల కేంద్రం వంటనూనెల దిగుమతిపై సుంకం పెంచేసింది. ఎటువంటి సుంకం లేని ముడి పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ మీద20 శాతం, రిఫైన్డ్ పాయిమాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచింది. దీనికి అదనంగా వ్యవసాయ సెస్ వడ్డిస్తుంది.