Budget Leak – John Mathai | వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌కు సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్దం అయ్యారు. శుక్రవారం సంప్రదాయం ప్రకారం హాల్వా వేడుకలో పాల్గొని ఆర్థికశాఖ అధికారులకు హాల్వా పేరుపేరున పంపిణీ చేశారు. హాల్వా వేడుకతో నార్త్‌బ్లాక్‌లో గల బడ్జెట్ ప్రింటింగ్ ప్రెస్‌లో బడ్జెట్ ముద్రిస్తారు. బడ్జెట్‌ను పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే వరకూ బడ్జెట్ తయారీలో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది నార్త్‌బ్లాక్‌లోనే ఉంటారు. నార్త్ బ్లాక్‌లో గల ప్రభుత్వ ప్రెస్.. ఆర్థిక, హోంశాఖ కార్యాలయాల మధ్య ఉంటుంది. నార్త్‌బ్లాక్‌లోని ప్రభుత్వ ప్రెస్లోనే అన్ని వేళ్లలో బడ్జెట్ ముద్రణ జరుగలేదు. ఎందుకిలా జరిగిందో తెలుసుకుందామా..?!
భారత్ రిపబ్లిక్‌గా మారిన తర్వాత 1950లో మింట్‌రోడ్‌లోని రాష్ట్రపతి భవన్లో ప్రెస్ ఉండేది. అదే ఏడాది రాష్ట్రపతి భవన్ ప్రెస్ నుంచి కేంద్ర బడ్జెట్ లీక్ అయ్యింది. అప్పటి వరకూ కొన్నేండ్లుగా రాష్ట్రపతి భవన్ ప్రెస్లోనే బడ్జెట్ ప్రింటయినా రహస్య గోప్యత ఉల్లంఘన జరుగలేదు. 1950లో బడ్జెట్ లీక్ అయిన తర్వాత దేశానికి అత్యంత ముఖ్యమైన బడ్జెట్ పత్రాలు మరింత సురక్షిత ప్రదేశంలో ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ పత్రాలు లీక్ కావడంతో అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మథాయి శక్తిమంతుల ప్రయోజనాలు కాపాడుతున్నారని విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో పార్లమెంట్‌కు బడ్జెట్ సమర్పించిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. ప్రణాళికా సంఘానికి నిరసనగా జాన్ మథాయి తన పదవికి రాజీనామా చేశారు. 1980లో బడ్జెట్ ప్రింటింగ్ ప్రెస్‌ను నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక, హోంశాఖ కార్యాలయాల మధ్యకు మార్చారు.
కేంద్ర బడ్జెట్ తయారీ అత్యంత సురక్షితం, గోప్యంగా సాగేది. ఈ సెక్యూరిటీని మరింత పెంచారు. బడ్జెట్ ప్రింటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ‘లాక్-ఇన్- పీరియడ్’ అమల్లోకి వస్తుంది. అంటే ఆర్థికశాఖ అధికారులు, సిబ్బంది నార్త్ బ్లాక్‌లోని ప్రింటింగ్ ప్రెస్లోనే ఉండిపోతారు. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్లను కూడా లోపలికి అనుమతించరు. పార్లమెంట్‌కు కేంద్ర బడ్జెట్ సమర్పించిన తర్వాతే వారు బయటకు వస్తారు.