ITR | న్యూఢిల్లీ, జనవరి 10: మరో మూడు వారాల్లో కేంద్ర బడ్జెట్ రానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తమ ప్రీ-బడ్జెట్ మెమరాండంలో కేంద్ర ప్రభుత్వానికి ఓ సూచన చేసింది. నూతన పన్ను విధానంలో భార్యాభర్తలకు ఒకే ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను కలిసి దాఖలు చేసే అవకాశం కల్పించాలన్నదే ఆ సూచన. ఈ జాయింట్ ట్యాక్సేషన్ స్కీం కుటుంబాలకు లాభిస్తుందని, అంతేగాక పన్ను ఎగవేతలకూ చెక్ పెట్టినట్టవుతుందని పేర్కొన్నది. ‘కొత్త పన్ను విధానంలో పైండ్లెన ట్యాక్స్ పేయర్ జంటలకు తమ భాగస్వామితో కలిసి సంయుక్త ఐటీఆర్ దాఖలును ఎంచుకొనే వీలు కల్పించాలి. అలాగే వేర్వేరుగా ఐటీఆర్‌లను దాఖలు చేసే అవకాశం కూడా ఇవ్వాలి’ అని ఐసీఏఐ సూచించింది. ఏది ఎంచుకుంటారో ట్యాక్స్ పేయర్స్‌కే వదిలేయాలన్నది.
ఇప్పటిదాకా..
ఐటీఆర్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానాలను ఎంచుకొనే వెసులుబాటు ఉన్నది. కొత్త పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ.3 లక్షలదాకా ఉంటే ఎటువంటి పన్నులూ చెల్లించనక్కర్లేదన్న విషయం తెలిసిందే. అయితే ఈ జాయింట్ ఐటీఆర్ ట్యాక్స్ పేయర్స్‌కు దాన్ని రెట్టింపు చేయాలని, పన్ను మినహాయింపును రూ.6 లక్షలకు పెంచాలని ఐసీఏఐ సూచించింది. ఇక పాత పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలదాకా పన్ను మినహాయింపున్నది. ఈ క్రమంలోనే జాయింట్ ఐటీఆర్ ప్రతిపాదనను ఐసీఏఐ తీసుకురాగా, జీవన వ్యయాలు పెరిగినందున పన్ను మినహాయింపును కూడా పెంచాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తున్నది. దీంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్నది.
ఇదీ సంగతి..
నిజానికి దంపతులకు జాయింట్ ట్యాక్సేషన్ అనేది కొత్తదేమీ కాదు. ఆయా అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్నదే. అమెరికా, బ్రిటన్లలో భార్యాభర్తలు సంయుక్తంగా ఆదాయ పన్ను రిటర్నును దాఖలు చేసే వీలున్నది. దీనివల్ల విడివిడిగా ఐటీఆర్‌లను దాఖలు చేస్తున్నవారితో పోల్చితే పన్ను మినహాయింపు, పన్ను శ్లాబులు పెరుగుతుండటంతో చాలామంది జాయింట్ ఐటీఆర్లనే ఎంచుకొని పన్ను భారాన్ని తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్‌లోనూ దంపతులకు జాయింట్ ఐటీఆర్ దాఖలుకు అవకాశమిస్తే కుటుంబాలపై పన్ను భారం తగ్గి, ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని, గృహస్తులకు మేలు జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకూ జరుగుతుందని ఐసీఏఐ అభిప్రాయపడుతున్నది.
పన్ను రేట్లు తగ్గాలి: అసోచామ్
రాబోయే బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తప్పక దృష్టి సారించాలని అసోచామ్ తమ ముందస్తు బడ్జెట్ నివేదికలో అభిప్రాయపడింది. కార్పొరేట్ పన్ను రేట్లు ఇతర దేశాలతో పోల్చితే పోటీగానే ఉన్నాయన్న ఈ వ్యాపార, పారిశ్రామిక సంఘం.. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు మాత్రం తగ్గాల్సిన అవసరం ఉందని గట్టిగా పేర్కొనడం గమనార్హం. గరిష్ఠంగా హాంకాంగ్‌లో 15 శాతం, శ్రీలంకలో 18 శాతం, సింగపూర్‌లో 22 శాతం, బంగ్లాదేశ్‌లో 25 శాతంగా ఉన్నాయని గుర్తుచేసింది.
ఐసీఏఐ సూచనలివే..
ప్రతిపాదిత ట్యాక్స్ శ్లాబులు
జాయింట్ ఐటీఆర్‌లను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు వర్తించే ట్యాక్స్ శ్లాబులనూ ఐసీఏఐ సూచించింది.