Union Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల 22న పార్లమెంట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారని తెలుస్తోంది. జూలై మూడో తేదీన ఆర్ధిక సర్వేను వెల్లడిస్తారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ ఇంటరిం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
రెండోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్.. బడ్జెట్ కూర్పుపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సూక్ష్మంగా సమగ్ర విశ్లేషణతో బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆమె చెప్పినట్లు తెలుస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రాధాన్యాలపై కేంద్రీకరిస్తూ బడ్జెట్ రూపకల్పన చేయాలని నిర్మలా సీతారామన్ అన్నారని చెబుతున్నారు. కాగా, ఈ నెల 22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగనున్నది. గతేడాది అక్టోబర్ తర్వాత జరుగుతున్న తొలి జీఎస్టీ సమావేశం.